కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. నలుగురికి గాయాలు
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అప్రమత్తమైన ముగ్గురు కూలీలు బ్రిడ్జి మీద నుంచి పక్కకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు నేషనల్ హైవే నిర్మాణం పూర్తయింది. కాగా ఖమ్మం నుంచి వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట వరకు పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం నుంచి ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అయితే వైరా వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. వైరా నుంచి మధిరకు వెళ్లే ప్రధాన రహదారిలో తల్లాడకు వెళ్లే మార్గంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌కు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ముగ్గురు కూలీలు పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దృష్టి సారించారు.