Mrigashira Karte 2026 | రోళ్లు పగిలే రోహిణి కార్తె( Rohini Karte ) నేటితో పూర్తి కానుంది. ఇక తొలకరి చినుకులతో మృగశిర కార్తె( Mrigashira Karte )ప్రారంభం కానుంది. మృగశిర కార్తె వచ్చిందంటే వానలు( Rains ) సమృద్ధిగా కురుస్తాయని అన్నదాతల నమ్మకం. ఇన్నాళ్లు వేసవి తాపానికి తల్లడిల్లిన ఈ పుడమి తల్లి మృగశిర కార్తెలో పులకించనుంది. ఇక రైతులు కూడా తమ పొలాలను సాగుకు సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమవుతారు. మరి ఇంతటి ప్రాధాన్యత గల మృగశిర కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది..? ఈ కార్తెలో తప్పకుండా చేపలు తినాలా..? అనే విషయాలను తెలుసుకుందాం.
మృగశిర కార్తె ఎలా ఏర్పడుతుంది?
తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించే కాలాన్నే మృగశిర కార్తె అంటారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది.
మరి ఈ ఏడాది మృగశిర కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది..?
జూన్ 8వ తేదీన అంటే సోమవారం నాడు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ కార్తె జూన్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ కార్తెను తెలుగు ప్రజలు ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. మరి ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులు ఈ కార్తెలోనే ప్రారంభిస్తారు. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులను ప్రారంభిస్తారు. అందుకే ఈ కార్తెను ఏరువాక కాలం అని కూడా పిలుస్తారు.
మరి చేపలు తప్పకుండా తినాలా..?
ఎండాకాలం ముగిసి వానాకాలం ప్రారంభమయ్యేది మృగశిర కార్తెలోనే. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులతో శరీరంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి. రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. సీజనల్ వ్యాధులు కూడా వస్తుంటాయి. మరి ముఖ్యంగా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే మృగశిర కార్తెలో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చేపలను విరివిగా తినాలని పెద్దలు చెబుతుంటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం.
