Karthika Masam | రేపటి నుంచే పరమపవిత్రమైన కార్తీక మాసం..! ఈ మాసం విశిష్టత ఏంటీ..? స్కంద పురాణం ఏం చెబుతున్నది..?
Karthika Masam | కార్తీక మాసం నవంబర్ 2న ప్రారంభం కానున్నది. ఈ మాసాన్ని హిందువులు పరమపవిత్రమైన మాసంగా భావిస్తుంటారు. కార్తీక మాసం భోళా శంకరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని స్కంద పురాణం పేర్కొంటున్నది.

Karthika Masam | కార్తీక మాసం నవంబర్ 2న ప్రారంభం కానున్నది. ఈ మాసాన్ని హిందువులు పరమపవిత్రమైన మాసంగా భావిస్తుంటారు. కార్తీక మాసం భోళా శంకరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని స్కంద పురాణం పేర్కొంటున్నది. కార్తీకమాసానికి సరైన మాసం లేదని చెబుతున్నది. ఎంతో మహిమాన్వితమైన ఈ మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. నెల రోజుల పాటు పరమేశ్వరుడిని భక్తితో పూజిస్తుంటారు. సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు కొనసాగుతుంటాయి. ఉపవాసం ఉంటూ పరమేశ్వరుడి కటాక్షం కోసం చూస్తుంటారు. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తుంటాడు. అందుకే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది.
పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం..
తెలుగు నెలల్లో కార్తీక మాసం ఎనిమిదో మాసం. ఈ మాసం పరమేశ్వరుడితో పాటు విష్ణువుకు సైతం ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక మాసం మాసంలో శివాలయాల్లో భక్తులు శంకరుడి అనుగ్రహం కోసం అభిషేకాలు, బిల్వార్చనలు చేస్తారు. అలాగే, జీతకరీత్యా ఉన్న దోషాలు.. బాధలు తొలగిపోవాలని వేడుకుంటారు. ఈ మాసంలో పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో అర్చించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని.. ఇక మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో పవిత్ర నదిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తుంటారు. అవివాహితులు, వివాహితులైన మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైందిగా పేర్కొంటారు. నది ఒడ్డున స్నానం చేయలేకపోతే, మీ స్నానపు నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలుపుకొని చేయవచ్చు.
కార్తీక పౌర్ణమి విశిష్టత..
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 15న వస్తున్నది. ఆ రోజున నదుల్లో స్నానాలు చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపం వెలిగించి మహాశివుడిని దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను నదుల్లో వదులుతారు. సోమవారాలు ఉసవాస దీక్షను చేస్తుంటారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేసిన వారికి.. ప్రదోష సమయంలో శివారాధన చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. శివాలయానికి వెళ్లి పూజలు చేస్తే దోషాలు తొలగుతాయని.. బాధలు ఉండవని నమ్మకం. అలాగే దీపారాధన చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
కార్తీక మాసంలో దీప దానానికి..
కార్తీక మాసంలో దీప దానానికి ఎంతో విశిష్టత ఉన్నది. పవిత్ర నది, తీర్థయాత్ర స్థలం, ఆలయం వద్ద, ఇంట్లో తులసి దగ్గర రోజువారీ దీపం దానానికి ప్రాముఖ్యత ఉన్నది. శరద్ పౌర్ణమి నుంచి ప్రతిరోజూ దీపదానాలు చేస్తూ వస్తుంటారు. దీప దానం చేస్తే ఇంటి చీకటితో పాటు జీవితంలో అలుముకున్న చీకట్లు తొలగిపోతాయని.. లక్ష్మీదేవి సంతోషించి ఇంటిని సిరిసంపదలతో నింపుతుందని విశ్వాసం. హిందూ సాంప్రదాయంలో తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలో తులసి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉన్నది. కార్తీక మాసంలో ఒక నెల పాటు తులసి ఎదుట దీపం పెడితే అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరిక చెట్టుకు పూజలు చేస్తుంటారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది చెబుతారు. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనాలు చేస్తారు. వీటిని వన భోజనాలు పిలుస్తుంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగిస్తుంటారు.