బీరువా ఏ దిశలో పెడితే మంచిది..? బట్టల మధ్యలో బంగారం ఉంచొచ్చా..?
ఇంట్లో నగదు దాచే బీరువా విషయంలో ఈ నియమాలు పాటించాలని చెబుతున్నారు. మరి బీరువా ఏ దిశలో ఉండాలి...? ఎక్కడ డబ్బు దాచాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.

తమకున్న తెలివితేటలతో చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు. భవిష్యత్ తరాలకు కావాల్సినంత డబ్బులను పోగేస్తుంటారు. కానీ ఆ డబ్బును ఎలా దాచాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఊహించని విధంగా జమ చేసిన నగదు అంతా నీళ్లలా ఖర్చు అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ఈ జాగ్రత్తలు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నగదు దాచే బీరువా విషయంలో ఈ నియమాలు పాటించాలని చెబుతున్నారు. మరి బీరువా ఏ దిశలో ఉండాలి…? ఎక్కడ డబ్బు దాచాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.
నైరుతి దిశలో బీరువా పెట్టొచ్చా..?
నైరుతి దిశలో బరువు ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఆ దిశలోనే బీరువా ఉంచుతారు. ఆ దిశలో బీరువా పెట్టడం మంచిదే కానీ.. దాంట్లో లక్ష్మీదేవి చిహ్నాలైన డబ్బు, బంగారం పెట్టకూడదు. నైరుతి దిశలో ఉంచిన బీరువాలో డబ్బు, బంగారం దాచితే.. డబ్బు నిలవదు. అప్పుల బాధలు అధికమైపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఉత్తరం దిక్కు మంచిదేనా..?
కుబేర స్థానమైన ఉత్తరం దిక్కులో బీరువా ఉంచితే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నైరుతి దిక్కులో ఏర్పాటు చేసిన దాని కన్నా చిన్న బీరువాను ఉత్తర గోడకు ఆనించకుండా, వాయువ్యం ఖాళీ ఉంచి దక్షిణం వైపు చూసేలా బీరువాను ఉంచి అందులో డబ్బు, నగలు వంటివి పెడితే డబ్బులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో నగలు ఒకటి ఉన్నవాళ్లు పది చేయించుకునే స్థోమత కలుగుతుంది.
బట్టల మధ్యలో బంగారం పెట్టొచ్చా..?
చాలా మంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు, బంగారం దాచేస్తుంటారు. ఇది సరికాదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. బీరువాలో బట్టల మధ్య బంగారం దాచడం వల్ల.. ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు.
మంచం మీద బంగారం ఉంచొచ్చా..?
లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతోంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారం, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోను పెట్టకూడదు. మంచం అనేది భోగ స్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది.
డబ్బులు దాచే బీరువాపై బరువులు పెట్టొచ్చా..?
డబ్బు, బంగారం ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్‌కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటి సరంజామా పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువాపైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెబుతోంది.