జూన్‌ 21న తిరిగి నిర్వహించనున్న నీట్ యూజీ రీ టెస్ట్ పరీక్షకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షించనుంది. పేపర్‌ తయారీ నుంచి ఫలితాల వరకు నిశితంగా పరిశీలించనుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైన సంగతి తెలిసిందే. దీంతో రద్దు చేసిన ఈ పరీక్షను జూన్‌ 21న తిరిగి నిర్వహించనున్నారు. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది.

రద్దైన నీట్ పరీక్ష ఫీజు రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించే గడువును ఎన్‌టీఏ జూన్ 22 వరకు పొడిగించింది. ముందుగా ఈ గడువు మే 27తో ముగియాల్సి ఉండగా, విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు నెలరోజుల పాటు పొడిగించినట్లు తెలిపింది. ఇప్పటివరకు 13 లక్షల మంది అభ్యర్థులు రీ ఫండ్ కోసం తమ బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.