School Enrollment In India | ఏడేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిన స్కూళ్లలో విద్యార్థుల నమోదు
భారతదేశంలో 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జనన రేటు తగ్గుదల, ఆర్థిక పరిస్థితులే ఈ తగ్గుదలకు కారణమని UDISE+ నివేదిక పేర్కొంది.

హైదరాబాద్, అక్టోబర్ 8 (విధాత ప్రతినిధి): 2024–25 విద్యా సంవత్సరంలో ఇండియాలో ఏడేళ్ల కనిష్టస్థాయికి విద్యార్థుల నమోదు పడిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో 24.68 కోట్ల మంది విద్యార్థులు స్కూల్లో చేరడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 11 లక్షలు తగ్గింది. దేశ జనాభాలో మార్పును ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి నుంచి ఐదు తరగతుల విభాగంలో 34 లక్షల విద్యార్థుల నమోదు తగ్గిందని ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పడిపోతున్న స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య
2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదుతో పాటు ఇతర వివరాలను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ +)నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ సహా ఇతర పాఠశాలల్లో మొత్తం 24.68 కోట్ల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఈ నివేదిక చెబుతోంది. గత కొన్నేళ్లుగా స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి.2023-24లో పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 24.8 కోట్లు, ఇది 2022-23లో 25.18 కోట్లుగా ఉంది. 2021-22 నుండి మొత్తం నమోదు నిరంతరం తగ్గుతోంది.ప్రాథమిక స్థాయిలో ఐదో తరగతి లోపు విద్యార్థుల నమోదు 2023–24లో 10.78 కోట్ల నుండి 2024–25లో 10.44 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 34 లక్షల మంది విద్యార్థులు తగ్గారని నివేదిక హైలైట్ చేసింది.అయితే ప్రీ-ప్రైమరీ (నర్సరీ, కిండర్ గార్టెన్), అప్పర్ ప్రైమరీ (6-8 తరగతులు), సెకండరీ (9-10) హయ్యర్ సెకండరీ (11-12)లలో నమోదులో పెరుగుదల ఉంది.
జనాభా తగ్గుదలే కారణమా?
కొన్ని రాష్ట్రాలు మినహా విద్యార్థుల నమోదులో తగ్గుదలకు ప్రధానంగా జనన రేటు తగ్గుదల కారణమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటులో తగ్గుదల ఉంది. అయితే దాని ప్రభావం పాఠశాల నమోదు గణాంకాలపై ప్రతిబింబించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 2021 నాటికి తగ్గింది. ప్రతి మహిళ సంతానోత్పత్తి రేటు 2.1 నుంచి 1.91కు తగ్గింది. సంతానోత్పత్తి రేటు 2011 జనాభా లెక్కల ఆధారంగానే అధికారులు చెబుతున్నారు. అయితే 2026లో చేపట్టే కొత్త జనాభా లెక్కల్లో సమగ్ర సమాచారం రానుంది. 2022లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) “ప్రొజెక్షన్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ స్కూల్ ఎన్‌రోల్ మెంట్ బై 2025 పేరుతో ఒక రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 6–16 సంవత్సరాల వయస్సు చిన్నారుల జనాభా తగ్గుతుందని ఈ రిపోర్టు తెలిపింది. దీని ఆధారంగా అన్ని స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్యకూడా తగ్గుతుందని అంచనా వేసింది.
కరోనా తర్వాత చాలా కుటుంబాల ఆర్ధిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇది కూడా పిల్లల చదువుపై ప్రభావం చూపిందనే నివేదికలు చెబుతున్నాయి. సామాన్యుడికి విద్య అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా మరో కారణంగా ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు, చదువు విషయంలో పేరేంట్స్ మద్దతు లేకపోవడం వంటి అంశాలు కూడా విద్యార్థులు చదువు మానేయడానికి కారణాలుగా సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఒక కారణం.
జనాభా పెరుగుదలకు ప్రణాళికలు
నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జూలైలో జరిగింది. ఈ సమావేశంలో జనాభా, వృద్దాప్య సమస్యల పరిష్కరించేందుకు జనాభా పెరుగుదలకు ప్రణాళికలు ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలను ప్రోత్సహించాలని డిసైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దక్షిణ భారతదేశంలో తక్కువ జనన రేటు గురించి ఆందోళన చెందారు. జనాభా తగ్గుదల పార్లమెంట్ లో ఎంపీ సీట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఓ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 12.75 కోట్ల నుంచి 12.16 కోట్లకు తగ్గింది. అంటే 59 లక్షల మంది విద్యార్థులు తగ్గారని ఈ నివేదిక సారాంశం.