‘iBOMMA’ Ravi | ‘ఐబొమ్మ’ రవి అరెస్ట్ : ఇక నై బొమ్మే – చిత్రసీమ హర్షం

ఐబొమ్మ(iBOMMA) వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని కూకట్ పల్లిలో అరెస్టు చేశారు. ఐబొమ్మ పైరసీ చర్యల కారణంగా సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం జరిగిందని గతంలో పోలీసులు వెల్లడించారు.

‘iBOMMA’ Ravi | ‘ఐబొమ్మ’ రవి అరెస్ట్ : ఇక నై బొమ్మే – చిత్రసీమ హర్షం
  • కరేబియన్టు కూకట్పల్లి పోలీసుల వలలో ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి

తెలుగు సినిమాలను ఎప్పటి నుంచో పైరసీ చేస్తున్న ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ మాస్టర్‌మైండ్ ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్‌ నుంచి వచ్చి కూకట్‌పల్లిలో దిగిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో రవి గత కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే iBomma వెబ్‌సైట్‌ను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో వచ్చే కంటెంట్—మొత్తం పూర్తి హై రిజొల్యూషన్​తో లీక్ అయ్యేలా అతడే ఏర్పాట్లు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అయితే రవి ఇంతకాలం దాక్కున్నప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి భారత్‌కు వచ్చాడు. ఆయన భార్యతో ఉన్న కుటుంబ సమస్యల కారణంగా హైదరాబాద్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని రవి భార్యే ముందుగా సైబర్ క్రైమ్ అధికారులకు ఉప్పందించినట్లు తెలుస్తోంది. దీంతో రవి ఏ ఫ్లైట్‌లో వస్తాడు, ఎక్కడ దిగుతాడు అన్న వివరాలు పోలీసులకు ముందుగానే స్పష్టంగా తెలిసిపోయాయి. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకే సవాల్​ విసిరిన రవి, చివరికి వారు విసిరిన వలలోనే పడ్డాడు.

పోలీసుల రహస్య ఆపరేషన్హార్డ్‌డిస్క్​ల్లో భారీ ఎత్తున పైరసీ కంటెంట్

సైబర్ క్రైమ్ అధికారులు రవిపై గత ఆరు నెలలుగా నిఘా పెట్టి ఉన్నారు. విదేశాల్లో ఉంటే అరెస్ట్ సాధ్యంకాదని తెలుసుకుని, అతను ఇండియా వచ్చేవరకు వేచి చూశారు. రవి కూకట్‌పల్లికి వచ్చిన వెంటనే అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న టీమ్ అతన్ని అరెస్ట్ చేసింది. అతడి నివాసం నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్లు, నెట్‌వర్క్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో— రిలీజ్‌కు రెడీగా ఉన్న కొత్త సినిమాలు, ఓటీటీ నుంచి లీక్ చేసిన ఫైళ్లు, పైరసీకి ఉపయోగించిన టూల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ రికార్డులు  ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతను ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్లలోని రూ.3 కోట్లను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇది పైరసీ ద్వారా వచ్చిన డబ్బే అని భావిస్తున్నారు. రవితో పాటు ఈ నెట్‌వర్క్‌లో మరికొందరు ఉన్నట్లు వివరాలు లభించాయి. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

చిత్రపరిశ్రమకు కొన్నేళ్లుగా తలనొప్పిఎట్టకేలకు ఉపశమనం

iBomma.net, boppam.tv  వల్ల టాలీవుడ్‌కు భారీ ఆర్థిక నష్టం జరిగింది. ఏ సినిమా విడుదలైనా కొద్ది గంటల్లోనే ఈ సైట్‌లో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. విదేశీ సర్వర్ల కారణంగా ఈ వెబ్‌సైట్‌ను అడ్డుకోవడం ఇంతకాలం కష్టమైంది.

కానీ రవి అరెస్ట్‌తో పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది. నిర్మాతలు, డైరెక్టర్లు చెప్పినట్లుగా, పైరసీ నెట్‌వర్క్ కూకటివేళ్లతో పెకలించివేయడానికి ఇదే పునాది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రవితో సంబంధం ఉన్న మరింతమంది వ్యక్తులు త్వరలో బయటపడే అవకాశముందని అధికారులు తెలిపారు.