Akhanda 2 | బాల‌య్య‌కి క్ష‌మాప‌ణ‌లు.. ఇండ‌స్ట్రీలోనే కొంత‌మంది నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నార‌న్న నిర్మాత‌లు

Akhanda 2 | ఈ ఏడాది ఆరంభంలో ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ, ఏడాది చివర్లో ‘అఖండ 2: తాండవం’తో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

  • By: sn |    movies |    Published on : Dec 13, 2025 10:12 AM IST
Akhanda 2 | బాల‌య్య‌కి క్ష‌మాప‌ణ‌లు.. ఇండ‌స్ట్రీలోనే కొంత‌మంది నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నార‌న్న నిర్మాత‌లు

Akhanda 2 | ఈ ఏడాది ఆరంభంలో ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ, ఏడాది చివర్లో ‘అఖండ 2: తాండవం’తో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని, ఇండస్ట్రీలోనే కొంత నెగిటివిటీ కనిపిస్తోందని నిర్మాతలు వ్యాఖ్యానించారు.

‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 12కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వాయిదా కారణంగా బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిర్ణీత సమయంలో సినిమాను విడుదల చేయలేకపోయినందుకు నిర్మాతలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు, ఆయన అభిమానులకు నిర్మాతలు క్షమాపణలు తెలిపారు.సినిమాకు వస్తున్న స్పందనను పురస్కరించుకుని తాజాగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్ ఆచంట మాట్లాడుతూ, “అఖండ 2: తాండవం సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక వారం వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ విషయానికి బాలయ్య బాబుకు, ఆయన అభిమానులకు, దర్శకుడు బోయపాటి శ్రీనుకి మా 14 రీల్స్ సంస్థ తరఫున సారీ చెబుతున్నాం. ఇది ఊహించని ఇష్యూ. అకస్మాత్తుగా ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించడంలో మ్యాంగో రామ్, దిల్ రాజు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వారికి థ్యాంక్స్. ఒక వారం ఆలస్యమైనప్పటికీ సినిమాకు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. ఫ్యాన్స్ సీట్లలో కూర్చోకుండా సెలబ్రేట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి” అన్నారు.

ఇక గోపీ ఆచంట మాట్లాడుతూ, “నైట్ ప్రీమియర్ షోలకే నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూలైంది. ఆశ్చర్యకరంగా కర్ణాటకలో కూడా రూ.1 కోటి కలెక్షన్స్ వచ్చాయి. నాన్-కన్నడ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ రోజు బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వీకెండ్‌కు అద్భుతమైన కలెక్షన్స్ చూడబోతున్నాం” అని తెలిపారు.

సినిమాపై వస్తున్న నెగిటివ్ టాక్ గురించి స్పందిస్తూ, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, కానీ ఇండస్ట్రీలోనే కొంతమంది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని నిర్మాతలు వ్యాఖ్యానించారు. మొత్తంగా ‘అఖండ 2: తాండవం’ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతూ, బాలయ్య అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.