Chiranjeevi | బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ స్పీచ్‌కి కొత్త అర్థాలు… ఇండస్ట్రీలో చర్చ

Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ, ఇప్పటికీ థియేటర్లను నిండుస్తున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి చిత్రం ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

  • By: sn |    movies |    Published on : Jan 26, 2026 8:54 AM IST
Chiranjeevi | బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ స్పీచ్‌కి కొత్త అర్థాలు… ఇండస్ట్రీలో చర్చ

Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ, ఇప్పటికీ థియేటర్లను నిండుస్తున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి చిత్రం ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయం గుర్తుగా దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఖరీదైన రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఘనంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, “ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అంటూ మెగాస్టార్ వినయంగా మాట్లాడారు. ప్రేక్షకుల ప్రేమే తనకు లభించిన అతిపెద్ద అవార్డని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమా ద్వారా కేవలం వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా తిరిగి ప్రేక్షకులకు అందించగలిగామని చెప్పారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు అనిల్ రావిపూడికే దక్కుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు పొందడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, ఇలాంటి విజయాలు పరిశ్రమలో మరింత మందికి అందాలని ఆకాంక్షించారు.

అయితే ఈ సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు మరో కోణంలో చర్చకు దారితీశాయి. “సినిమా హిట్ అయితే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటాను. అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ్యత మొత్తం నాదే” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. తప్పులు జరిగితే వాటిని ఇతరులపై నెట్టకుండా తానే ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటానని చెప్పడం ఇండస్ట్రీలో అరుదైన విషయం అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మాటలు గతంలో ‘ఆచార్య’ సినిమా సమయంలో వచ్చిన వివాదాలను పరోక్షంగా టచ్ చేశాయా అనే చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అప్పట్లో పలువురు విమర్శలు చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని మరోసారి చూపించాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి, ఆయన నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి టైమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నిర్మాతగా వ్యవహరించిన సుష్మిత కొణిదెలపై కూడా గర్వం వ్యక్తం చేస్తూ, తన కుటుంబ సభ్యురాలిగా కాకుండా ఒక నిర్మాతగా ఆమె విజయం చూసి సంతోషంగా ఉందన్నారు. మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్ కేవలం సినిమా విజయోత్సవంగానే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం, బాధ్యతాయుతమైన దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పిన వేదికగా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.