Keerthy Suresh | “లావుగా ఉన్నప్పుడు తగ్గమన్నారు.. ఇప్పుడు సన్నబడితే విమర్శలు”.. బాడీ షేమింగ్‌పై కీర్తి సురేశ్ ఆవేదన

Keerthy Suresh | సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ తాజాగా బాడీ షేమింగ్, తన ఫిట్‌నెస్ జర్నీపై భావోద్వేగంగా స్పందించారు. ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వాటిపై ఆమె స్పష్టత ఇచ్చారు.

  • By: Sandeep |    movies |    Published on : May 18, 2026 8:51 AM IST
Keerthy Suresh | “లావుగా ఉన్నప్పుడు తగ్గమన్నారు.. ఇప్పుడు సన్నబడితే విమర్శలు”.. బాడీ షేమింగ్‌పై కీర్తి సురేశ్ ఆవేదన

Keerthy Suresh | సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ తాజాగా బాడీ షేమింగ్, తన ఫిట్‌నెస్ జర్నీపై భావోద్వేగంగా స్పందించారు. ఇటీవల ఆమె లుక్‌లో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వాటిపై ఆమె స్పష్టత ఇచ్చారు.

కీర్తి సురేష్ కాస్త సన్నబడటంతో కొందరు నెటిజన్లు ఆమె ఏదో కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారంటూ కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన ఆమె, తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని స్పష్టం చేశారు. సహజమైన పద్ధతుల్లోనే ఫిట్‌నెస్ సాధించానని, తన కష్టాన్ని సర్జరీతో ముడిపెట్టడం బాధ కలిగించిందని పేర్కొన్నారు.

ఎలా ఆలోచిస్తారో అర్ధం కావ‌డం లేదు..

ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లో, “చిన్నప్పుడు లావుగా ఉన్నావని సన్నబడమన్నారు.. ఇప్పుడు సన్నబడ్డాక గతంలోనే బాగున్నావంటున్నారు. అసలు ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి వివరిస్తూ, కెరీర్ ప్రారంభ దశలో జిమ్, వ్యాయామాలపై పెద్దగా అవగాహన లేదని చెప్పారు. అయితే మ‌హాన‌టి సినిమా తర్వాత వచ్చిన విరామంలో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కేవలం తొమ్మిది నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు.

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానంతో..

అలాగే 2020లో యోగా తన జీవితంలోకి వచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు ఇష్టం లేని వ్యాయామం ఇప్పుడు తన జీవనశైలిలో భాగమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్‌ను సమతుల్యం చేస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రముఖ నిర్మాత జీ. సురేష్ కుమార్, సీనియర్ నటి మేన‌క కుమార్తె అయిన కీర్తి చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత హీరోయిన్‌గా మారి టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగారు. నేను శైల‌జ‌, నేను లోక‌ల్‌, దస‌రా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కీర్తి, మ‌హాన‌టిలో సావిత్రి పాత్రతో జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. పుకార్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.