Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి చేసిన ప్రయాణంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన భాగం గురించి మాట్లాడిన రామ్ చరణ్.. “ఢిల్లీ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చివరి 40 నిమిషాలే అసలు పెద్ది కథ. అందులోనే ఎక్కువ ట్విస్టులు ఉంటాయి. ఉప్పెన క్లైమాక్స్ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది” అని తెలిపారు. ఈ ఎపిసోడ్‌లో చరణ్ నటన చూసి తాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు.
చివరి 45 నిమిషాలు..
సినిమా కథలోని భావోద్వేగం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. “పెద్ది అనేది కేవలం యాక్షన్, రెజ్లింగ్ లేదా క్రికెట్ మూవీ కాదు. ఇది ఒక ఎమోషన్. కథలో కొన్ని సందర్భాల్లో హీరోయిజం తగ్గుతుందనిపించినా, అదే అంశం హీరో స్థాయిని మరింత పెంచుతుంది. ఈ తరం యువతకు ప్రేరణనిచ్చే పాత్రగా పెద్ది నిలుస్తుంది” అన్నారు.
మరోవైపు ఉప్పెన క్లైమాక్స్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేసిన బుచ్చిబాబు, ఈసారి కూడా ప్రేక్షకులు ఊహించని ముగింపును సిద్ధం చేసినట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో “సాధారణ క్లైమాక్స్ అయితే పెద్దగా చర్చ జరగదు. కానీ భిన్నమైన ముగింపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పెద్ది చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, భావోద్వేగానికి గురిచేస్తాయి” అని చెప్పారు.
మరో ట్రైలర్ విడుదల చేస్తారా..
ట్రైలర్‌లో రామ్ చరణ్ క్రికెటర్, రెజ్లర్, అథ్లెట్‌లా కనిపించడంతో ఆయన పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. క్లైమాక్స్‌లో ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ట్రైలర్‌కు మిక్స్‌డ్ స్పందన రావడంతో మరో ట్రైలర్ విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే భోపాల్‌లో జరగనున్న సంగీత కార్యక్రమంలో ప్రత్యేక పాటను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
