Peddi Movie Review |
చిత్రం: పెద్ది
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది చిత్రం కోసం ఎన్నాళ్ల నుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
విజయనగరం సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామానికి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. ఆ గ్రామం పేరు కూడా అధికారిక రికార్డుల్లో కనిపించదు. ఆ గ్రామ ప్రజలకు గుర్తింపు తీసుకురావాలని, తమ ఊరికి రైల్వే స్టేషన్ రావాలని అప్పలసూరి (జగపతి బాబు) ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తుంటాడు.
అయితే గ్రామానికి చెందిన పెద్ది (రామ్ చరణ్) మాత్రం తన జీవితాన్ని సరదాగా గడుపుతుంటాడు. క్రికెట్ ఆడుతూ, డబ్బు కోసం వివిధ జట్ల తరఫున ఆడటం అతని అలవాటు. ఓ అవమానం, అప్పలసూరి మరణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పెద్ది కొత్త ప్రయాణం మొదలుపెడతాడు.
క్రికెట్ నుంచి కుస్తీకి, అక్కడి నుంచి అథ్లెటిక్స్ వైపు అతని ప్రయాణం ఎలా సాగింది? గౌర్ నాయుడు (శివరాజ్ కుమార్) పాత్ర ఏమిటి? అచ్చియమ్మ (జాన్వీ కపూర్)తో ప్రేమకథ ఎలా సాగింది? చివరకు తన ఊరికి గుర్తింపు, రైల్వే స్టేషన్ తీసుకురాగలిగాడా? అనేదే సినిమా కథ.
నటీనటుల పనితీరు :
ముఖ్యంగా మనం చెప్పుకోవల్సింది రామ్ చరణ్ గురించి. రామ్ చరణ్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటిలోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన హృదయాన్ని తాకుతుంది. ఇక అప్పలసూరి పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. ఆయన పాత్ర సినిమాకు ఎంతో బలాన్ని అందిస్తుంది.
శివరాజ్ కుమార్ తన పాత్ర పరిధిలో చక్కటి నటన కనబరిచారు. కథలో కీలక మలుపుకు కారణమయ్యే పాత్రగా గుర్తుండిపోతారు. జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర దక్కింది. ప్రేమకథ కూడా అంతగా ప్రభావం చూపలేదు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు అనే చెప్పాలి.
సాంకేతిక విభాగం :
ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు ఇప్పటికే హిట్ కాగా, నేపథ్య సంగీతం కూడా కీలక సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. రత్నవేలు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. గ్రామీణ నేపథ్యం, క్రీడా సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలహీనత అని చెప్పాలి . కొన్ని సన్నివేశాల మధ్య ట్రాన్సిషన్స్ స్మూత్‌గా అనిపించవు.నిర్మాణ విలువలు బాగున్నాయి. వృద్ధి సినిమాస్ ఎక్కడా రాజీపడకుండా భారీ స్థాయిలో నిర్మించింది. ప్రతి ఫ్రేమ్‌లో ఆ గ్రాండియర్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్ అద్భుత నటన
ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్
క్లైమాక్స్, చివరి 30 నిమిషాలు
జగపతి బాబు పాత్ర
ఏఆర్ రెహమాన్ సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యం లేకపోవడం
బలమైన విలన్ ట్రాక్ లేకపోవడం
ప్రేమకథ బలహీనంగా ఉండటం
మూవీ ఎలా ఉందంటే?
‘రంగస్థలం’ తర్వాత మరోసారి నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం రామ్ చరణ్‌కు ‘పెద్ది’ రూపంలో దొరికింది. కమర్షియల్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ కథ కోసం, పాత్ర కోసం ఎంతదూరమైనా వెళ్లగలనని చరణ్ మరోసారి నిరూపించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను పూర్తిగా హీరోయిజం మీద కాకుండా భావోద్వేగాల మీద నడిపించారు. మొదటి భాగం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా ఉంటుంది. హీరో ఎంట్రీ, ఫైట్లు, పాటలు, మాస్ మూమెంట్స్ వరుసగా వస్తుంటాయి. అయితే కథ అసలు గమ్యం ఇంటర్వెల్‌కు ముందు ప్రారంభమవుతుంది.
ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి కథలో భావోద్వేగాలు పెరుగుతాయి. రెండో భాగంలో పెద్ది లక్ష్యం, అతని పోరాటం, గ్రామం కోసం చేసే ప్రయత్నాలు కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు సినిమాకు ప్రధాన బలం. అయితే కథనంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. క్రికెట్ నుంచి కుస్తీకి, కుస్తీ నుంచి పరుగుపందెం వైపు హీరో ప్రయాణం చాలా వేగంగా సాగిపోతుంది. కొన్ని కీలక మార్పులకు సరైన ఎమోషనల్ బిల్డప్ కనిపించదు. స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉండాల్సింది.
తీర్పు :
‘పెద్ది’ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ సినిమా కాదు. అదే సమయంలో పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కూడా కాదు. గ్రామం, గుర్తింపు, ఆత్మగౌరవం చుట్టూ తిరిగే భావోద్వేగ కథను బుచ్చిబాబు తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, రామ్ చరణ్ అద్భుత నటన, భావోద్వేగాలతో నిండిన క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి.
మొత్తంగా ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నటుడిగా చరణ్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది.