Priyanka Chopra | స్వర్ణ దేవాలయంలో సేవ చేసిన ప్రియాంక చోప్రా.. గిన్నెలు క‌డిగి మనసులు గెలుచుకున్న గ్లోబల్ స్టార్

Priyanka Chopra | హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కోట్లాది పారితోషికం, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ తన భారతీయ మూలాలను మరువలేదని ఆమె తాజా చర్యతో నిరూపించింది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 01, 2026 5:03 PM IST
Priyanka Chopra | స్వర్ణ దేవాలయంలో సేవ చేసిన ప్రియాంక చోప్రా.. గిన్నెలు క‌డిగి మనసులు గెలుచుకున్న గ్లోబల్ స్టార్

Priyanka Chopra | హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కోట్లాది పారితోషికం, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ తన భారతీయ మూలాలను మరువలేదని ఆమె తాజా చర్యతో నిరూపించింది.

మంగళవారం రోజు అమృత్ స‌ర్‌లోని పవిత్రమైన గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన ప్రియాంక, అక్కడ ఒక సాధారణ భక్తురాలిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పింక్ కలర్ సంప్రదాయ దుస్తులు ధరించి, తలపై దుపట్టా కప్పుకుని హర్మందిర్ సాహిబ్‌లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసింది.

పాత్ర‌ల‌ని శుభ్రం చేసిన ప్రియాంక‌..

అయితే, ఆమె చేసిన మరో పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గురుద్వారాల్లో భక్తులు స్వచ్ఛందంగా చేసే సేవలో భాగంగా ప్రియాంక కూడా పాల్గొంది. ఆలయ ప్రాంగణంలో నేలపై కూర్చుని భక్తులు భోజనం చేసిన పాత్రలను స్వయంగా శుభ్రం చేసింది. స్టార్‌డమ్‌ను పూర్తిగా పక్కన పెట్టి, ఎలాంటి అహంకారం లేకుండా సేవ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హాలీవుడ్‌లో సెటిల్ అయినా భారతీయ సంప్రదాయాలను మర్చిపోలేదు”, “నిజమైన గొప్పతనం ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఇతర భక్తులతో కూడా ప్రియాంక ఎంతో సరళంగా మెలిగి, సెల్ఫీలు దిగడం ఆమె వినయానికి నిదర్శనంగా నిలిచింది.

రాజ‌మౌళి సినిమాతో బిజీ…

ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, ప్రియాంక ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అదే సమయంలో రాజమౌళి-మ‌హేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ‘మందాకిని’ అనే పాత్రలో ఆమె కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ, నేలతల్లి సంస్కృతిని గౌరవిస్తూ వినయంగా ఉండడం ద్వారా ప్రియాంక చోప్రా మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచింది.