RAAKA | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలై సంచలనంగా మారింది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సగం మనిషి, సగం మృగంలా కనిపించే ఈ లుక్ సినిమా కాన్సెప్ట్‌పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అయితే కొంతమంది అభిమానులు ఈ లుక్‌ను చూసి డిజప్పాయింట్ అవుతున్నా, చాలా మంది మాత్రం ఇది కొత్త ఎక్స్‌పెరిమెంట్ అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాకా అర్ధం ఏంటి..
మొదటగా టైటిల్ ‘రాకా’ గురించి మాట్లాడుకుంటే… సంస్కృతంలో దీనికి ‘వెన్నెల రాత్రి’ అనే అర్థం వస్తుంది. మరోవైపు పదాన్ని విడదీసి చూస్తే ‘రా’ అంటే రాజు, ‘కా’ అంటే రక్షించేవాడు అని భావించవచ్చు. ఈ లెక్కన ‘రక్షించే రాజు’ అనే భావన కూడా ఈ టైటిల్‌లో దాగి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పోస్టర్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నుదిటిపై కనిపించే ప్రత్యేక గుర్తులు ఏదో గిరిజన తెగకు చెందిన గుర్తుల్లా అనిపిస్తున్నాయి. దీంతో సినిమా ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండొచ్చనే చర్చ మొదలైంది. అలాగే ఆ గుర్తులు అతని పాత్ర ఎదుర్కొన్న కష్టాలను, అనుభవాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
వేటగాడి పాత్రలో..
ఇక అతని కళ్లలో కనిపించే తీవ్రత మరింత ఆసక్తి రేపుతోంది. ఆ చూపులో కోపం, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది రివేంజ్ డ్రామా అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖంపై జంతువుల చర్మం, వెంట్రుకలు ఉండటం, చేతి గోర్లు ప్రమాదకరంగా కనిపించడం కలిపి అతను అడవిలో పెరిగిన వేటగాడి పాత్రలో కనిపించబోతున్నాడనే సంకేతాలు ఇస్తున్నాయి.
అలాగే తెల్లబడ్డ జుట్టు, మీసాలు చూసి ఈ పాత్రకు వయసు పైబడినట్టు అనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కూడా ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రపంచాన్ని కాపాడేందుకు సైంటిస్టులు అతన్ని ప్రత్యేకంగా మార్చారా? అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి.
భారీ అంచనాలు…
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు ఇప్పటికే వైరల్ కాగా, ప్రస్తుతం విడుదలైన లుక్ ఆ పాత్రల్లో ఒకదానికే సంబంధించినదై ఉండొచ్చని సమాచారం.
మొత్తానికి, ‘రాకా’ ఫస్ట్ లుక్‌తో అట్లీ ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
