Simran | దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన నటి సిమ్రాన్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
సినిమా కెరీర్ జోరుగా కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకున్న సిమ్రాన్ కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. అయితే తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి సహాయ పాత్రలతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఉరివేసుకొని ఆత్మహత్య..
అయితే సిమ్రాన్ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన గురించి చాలా మందికి తెలియదు. ఆమెకు మోనాల్, జ్యోతి ఆనంద్ అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వీరిలో మోనాల్ కూడా సినిమాల్లో అడుగుపెట్టి హీరోయిన్‌గా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించింది. తెలుగులో ‘ఇష్టం’ వంటి చిత్రాల్లో నటించిన మోనాల్, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది.
కానీ స్టార్ హీరోయిన్‌గా ఎదగాలన్న ఆశల మధ్యే మోనాల్ జీవితం విషాదాంతమైంది. 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఈ ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపింది.
ఎన్నో అనుమానాలు..
మోనాల్ మరణంపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆమె ఆత్మహత్యకు ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కారణమని సిమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో తీవ్ర నిరాశకు గురై మోనాల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె వాపోయారు. అయితే ఈ ఆరోపణలు తర్వాత అసలు విషయం బయటకు రాలేదు.
కాలక్రమంలో ఈ కేసు నెమ్మదిగా మసకబారిపోయినా, మోనాల్ ఆత్మహత్య వెనుక అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. దీంతో ఈ ఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మొత్తానికి, తెరపై విజయాలు సాధించిన సిమ్రాన్ జీవితంలో ఈ వ్యక్తిగత విషాదం ఒక చెరిగిపోని సంఘటనగానే మిగిలింది అని చెప్పాలి.
