Prabhas – Fauji | ప్రభాస్‌కు మళ్లీ రెండు భాగాల సినిమా..! ఇక కొత్త కథలే వద్దా?

టాలీవుడ్‌లో రెండు భాగాల ట్రెండ్ ఇప్పుడు సినిమా లాంగ్ ఫార్మాట్ కాదు… పూర్తిగా ఓవర్‌డోస్ ఫార్ములా అయిపోయింది. కథలో బలం ఎంత ఉందో, నిజంగా అవసరమో, లేదో పక్కన పెట్టి—‘Part 1’, ‘Part 2’ అంటూ వరుసగా క్లిఫ్‌హ్యాంగర్లు పెట్టేయడం ఇప్పుడు అలవాటుగా మారింది. దీనికి బాగా బలవుతున్నది రెబల్​స్టార్​ ప్రభాస్​.

Prabhas – Fauji | ప్రభాస్‌కు మళ్లీ రెండు భాగాల సినిమా..! ఇక కొత్త కథలే వద్దా?

Prabhas’ Fauji Turns Into Another Two-Part Film: Are Audiences Tired of Sequels?

వరుసగా రెండు భాగాల సినిమాలే అయితే, ప్రేక్షకుల్లో విసుగు పెరుగుతుందని తెలియదా?

(విధాత వినోదం డెస్క్​)

Prabhas – Fauji | ఈ డబుల్​ ట్రబుల్​ ట్రెండ్‌కు గతంలో బాహుబలి కారణం కావచ్చు. కానీ బాహుబలికి రెండు భాగాలకు సరిపడా కథ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకు విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. పుష్ప2కు కూడా సరిపోయినంత కథ లేదు. కానీ, అన్న కూతురు ఎపిసోడ్​ పెట్టి సుకుమార్​ లాగించేసాడు. ఇక సలార్​ సంగతి సరేసరి. మొదటి భాగమే అంతంతమాత్రం. అసలే ప్రశాంత్​ నీల్​ చీకట్లో తీసే సినిమా. దానికి ఇంక రెండో భాగమంటే దర్శకుడికే తెలియాలి.

బాహుబలి, సలార్, కల్కి… ఇవన్నీ రెండు భాగాలే. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కూడా అదే బాట పట్టింది. ఇంకా స్పిరిట్​, రాజాసాబ్​ కూడా రెండు భాగాలని రూమర్లు. ఈ వరుస చూస్తుంటే ప్రభాస్​ ఈ రెండు భాగాల ఫార్మాట్​కు బ్రాండ్​ అంబాసిడర్​ అయినట్లున్నాడు.

అబ్బా… మళ్లీ రెండు భాగాలా..? – అభిమానుల మూతివిరుపులు

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ—మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ హైప్ పెంచింది.
ఇది కూడా రెండు భాగాలేనట… డైరెక్టర్ హను స్వయంగా క్లారిటీ ఇచ్చాడు—ఫౌజీ రెండు భాగాలే, అంతేకాదు రెండో భాగం ప్రీక్వెల్‌గా వస్తుందని ప్రకటించాడు. వలస పాలన నేపథ్యంలో సాగనున్న ఆ కథ ప్రభాస్ పాత్రకు మరో కోణాన్ని చూపిస్తుందని చెప్పినా… ప్రేక్షకులలో మాత్రం మరోసారి అదే పాత భావన—
మళ్లీ క్లిఫ్‌హ్యాంగర్… నెక్స్ట్ పార్ట్ కోసం వేచి చూడాలా?”

ఫౌజీ వివరాలు వినడానికి బాగున్నారెండు పార్టుల ఫార్ములా మాత్రం బాగాలేదు.

ఫౌజీ ఒక దేశభక్తి యాక్షన్ ఎపిక్. ప్రభాస్ ఒక ధైర్యవంతుడైన సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. భారీ సెట్‌లు, యాక్షన్ సీన్లు, ఎమోషనల్ లేయర్స్—all ఓకే. ఇదొక పీరియాడిక్​ కథ. పీరియాడిక్​ కథలు అదరించడానికి ఇదేం హాలీవుడ్​ కాదు. తెలుగులో ఎన్ని పీరియాడిక్​ కథలు హిట్​ అయ్యాయో చెప్పగలరా? ఈ దర్శకుడు హను రాఘవపూడి ‘సీతారామం’ పీరియాడిక్​ అనుకుందాం. కానీ అందులో సమకాలీన భావనలున్నాయి. ఆ మాటకొస్తే అదొక వర్థమాన రచయిత రాసిన నవలకు కాపీ. ఆ రచయిత చెప్పిన కథ విని, చేద్దాం అని.. సడెన్​గా ‘సీతారామం’గా తీసి, ఆ యువరచయితను మోసం చేసాడు. మరి ఈ ఫౌజీకి బలైన రచయిత ఎవరో ఇంకా తెలియదు.

కానీ ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకే సినిమాగా చెప్పాల్సిన బదులు… మళ్లీ రెండు భాగాలుగా విడగొడుతున్నారన్న భావన ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. గతంలో వచ్చిన అనేక రెండు భాగాల సినిమాలు కూడా మొదటి పార్ట్‌లో కావాల్సిన తృప్తిని ఇవ్వకపోవడంతో రెండో భాగాలు ఆగిపోయిన సందర్భాలున్నాయి. సాధారణంగా పార్ట్​ 2లన్నీ ఫ్లాపులే. హాలీవుడ్​లో నాటి స్టార్​వార్స్​ దగ్గర్నుండి నేటి అవతార్​ వరకు.

ఇక ప్రభాస్ చేతిలో:

  • సలార్ 2
  • కల్కి 2
  • స్పిరిట్
  • రాజాసాబ్ (ఇది కూడా రెండు భాగాలని టాక్)

ఇలా వరుసగా రెండు భాగాల ప్రాజెక్టులే ఉండటంతో ప్రేక్షకుల్లో అసహనం మరింత పెరిగే పరిస్థితి. స్టార్ పవర్ ఉన్నా, వరుసగా పాత ఫార్ములానే రిపీట్ అయితే ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న రావడం సహజం—
ప్రభాస్ కొత్త కథలు ఎప్పుడు చేస్తాడు?”

ఫౌజీ ప్రీక్వెల్‌తో సహా రెండు భాగాలుగా రావడం ఫ్యాన్స్‌కు పండుగే. కానీ సాధారణ ప్రేక్షకుల అభిప్రాయం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది— పూర్తి సినిమా ఒక్కసారిగా ఇవ్వలేరా? మధ్యలో ‘టు బీ కంటిన్యూడ్’ అవసరమా?”

2002 ప్రారంభమైన ప్రభాస్​ కెరీర్​ ప్రస్తుతానికి పాతిక సినిమాలకు పరిమితమైఉంది. ఇక రావాల్సినవి వరుసగా రెండు భాగాల మొదటి పార్ట్​ లేదా రెండోపార్ట్​. చేతిలో ఉన్నవి ఐదు సినిమాలు ఇవన్నీ పూర్తయ్యేసరికి ఇంకో పదేళ్లు పడుతుంది. అంటే అప్పటికి ప్రభాస్​ వయసు 56 ఏళ్లు. ఇదొక విచిత్ర సమస్య. ఎవరికీ రాని సమస్య.

ఈ పాన్​ ఇండియా, పాన్​ వరల్డ్​ అనే వ్యాధి నుండి తెలుగు చిత్రసీమ బయటపడితే పరిశ్రమ, హీరోలు బాగుంటారు. లేకపోతే, రెండు మూడు సినిమాలకే ముసలోళ్లయిపోయి ఎటూకాకుండా పోతారు.