Shoulder Clicking Sounds | భుజం కదిలించగానే ‘క్లిక్’ శబ్దం వినిపిస్తుందా?
భుజం కదలికలో వచ్చే క్లిక్ లేదా పాప్ శబ్దాలు సాధారణం. నొప్పి, వాపు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

రోజువారీ జీవితంలో భుజం కదిలించినప్పుడు క్లిక్ లేదా పాప్ శబ్దం వినిపించడం చాలా మందికి అనుభవమే. చేతిని పైకి ఎత్తినా, పక్కకు తిప్పినా, ఆ శబ్దం కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ ఈ శబ్దం ప్రమాద సూచనా? లేక శరీరం సహజంగానే ఇచ్చే ప్రతిస్పందనా? భుజం క్లిక్ శబ్దాల వెనుక ఉన్న బయాలజికల్ కారణాలు, ఎప్పుడు జాగ్రత్త అవసరమో, అలాగే భుజ ఆరోగ్యాన్ని ఎలా చెక్ చేసుకోవాలో నిపుణులు అందిస్తున్న సూచనలు…
భుజం ఎలా పనిచేస్తుంది?
భుజం అనేది శరీరంలోని అత్యంత కాంప్లెక్స్ జాయింట్లలో ఒకటి. ఇది హ్యూమరస్ ఎముక, స్కాపులా, క్లావికల్ అనే మూడు ఎముకలతో పాటు, లిగమెంట్లు, టెండాన్లు, కండరాలు కలిసి పనిచేసే వ్యవస్థ. అందువల్ల చిన్న మార్పులు కూడా కదలికలో శబ్దాల రూపంలో బయటపడుతుంటాయి.
క్లిక్ శబ్దానికి కారణాలు
1. సైనోవియల్ ఫ్లూయిడ్ లో బబుల్స్
• ప్రతి జాయింట్‌లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ద్రవం ఉంటుంది. ఇది లూబ్రికెంట్ లా పనిచేస్తూ ఎముకలు ఒకదానితో ఒకటి రాసుకోకుండా కాపాడుతుంది.
• ఈ ద్రవంలో చిన్న గాలిబుడగలు ఏర్పడతాయి. కదలిక సమయంలో అవి పగిలిపోతూ క్లిక్ లేదా పాప్ అనే శబ్దం చేస్తాయి.
• ఇది పూర్తిగా సహజం, హానికరం కాదని చెబుతున్నారు నిపుణులు.
2. స్కాపులర్ మసిల్స్ బలహీనత, షోల్డర్ క్యాప్సూల్ టైట్‌నెస్
• కొన్నిసార్లు భుజం చుట్టూ ఉన్న స్కాపులర్ మజిల్స్ బలహీనమవుతాయి.
• భుజం క్యాప్సుల్ గట్టిపడటం వల్ల కూడా క్లిక్ శబ్దం రావచ్చు.
• ఇది సాధారణంగా పెద్ద సమస్య కాదు. కానీ, ఈ శబ్దంతో పాటు నొప్పి ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
భుజం ఆరోగ్యంగా ఉందా.. లేదా?
ఒక వైపు పడుకుని చేతిని లోపలి వైపు తిప్పండి (internal rotation). ఈ సమయంలో నొప్పి వస్తే, లేదా చేతి కదలిక పూర్తిగా జరగకపోతే, మీ భుజం ఆరోగ్యం బాగాలేదని అర్థం.
భుజం ఆరోగ్యానికి…
• స్కాపులర్, షోల్డర్ మజిల్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
• మొబిలిటీ ట్రైనింగ్ ద్వారా భుజం కదలిక మెరుగుపరుచుకోవాలి.
• సరిగ్గా వ్యాయామం చేయడం వల్ల భుజం బలపడటమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే గాయాలు కూడా తగ్గుతాయి.
ప్రతి క్లిక్ శబ్దం సమస్య సంకేతం కాదు. కానీ ఆ శబ్దంతో పాటు భుజంలో నొప్పి, బలహీనత, వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో ఫిజియోథెరపిస్టు లేదా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదిస్తే, భుజం సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు.
భుజం నుంచి వచ్చే క్లిక్ లేదా పాప్ శబ్దాలు తరచూ హానికరం కావు. కానీ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా సరికాదు. అవి మీ శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలు కావచ్చు. చిన్న వ్యాయామాలు, సింపుల్ చెక్ లు, నిపుణుల సలహాతో మీరు మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో పొందుపరచిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది ప్రొఫెషనల్ మెడికల్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు తీవ్రమైన నొప్పి లేదా సమస్య ఉంటే, వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించండి.