New World screwworm | మనుషులను తినే పరాన్న జీవి.. దీని గురించి చదివితేనే దిమ్మతిరిగిపోద్ది!

స్క్రూ ఎలా ఉటుంది? అది చెక్క లేదా గోడలోకి ఎలా వెళుతుంది. సరిగ్గా ఈ పరాన్న జీవి కూడా జంవుతువులు, మనుషుల మాంస కణాల్లోకి చొచ్చుకొని వెళ్లిపోతుంది. అత్యంత భయానకమైన ఈ పరాన్నజీవి మనిషికి సోకిన తొలి కేసును అమెరికాలో గుర్తించారు.

New World screwworm | మనుషులను తినే పరాన్న జీవి.. దీని గురించి చదివితేనే దిమ్మతిరిగిపోద్ది!

New World screwworm | పురుగులు, దోమలు, చీమలు మనుషులను కుడతాయని తెలుసు. కానీ.. మొట్టమొదటిసారిగా మనిషి మాంసాన్ని తినేసే ఒక భయానక పరాన్న జీవి సోకిన కేసును గుర్తించారు. న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌గా పిలుస్తున్న ఈ పారాసైట్‌ తొలి కేసును అమెరికాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ ఆదివారం (ఆగస్ట్‌ 24 2025) ధృవీకరించింది. ఈ కేసును పరిశీలించిన మేరీల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఆగస్ట్‌ 4న ధృవీకరించాయి. ఇటీవల ఎల్‌సాల్వడార్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తిలో ఈ పారాసైట్‌ను గుర్తించారు. దీని శాస్త్రీయనామం న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌ మైయాసిస్‌ (ఈగ లార్వాల పరాన్నజీవి ముట్టడి). వేర్వేరు దేశాలకు ప్రయాణాలతో సంబంధం కలిగిన ఈ స్క్రూవామ్‌ అత్యంత ప్రమాదకరమైనదే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు తీవ్ర ముప్పు ఏమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏంటీ న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌?

నీలం, బూడిద రంగులతో ఉండే ఒక ఈగ లాంటిది ఈ న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌. ఇది సాధారణంగా దక్షిణ అమెరికా దేశాల్లో, కరీబియన్‌ దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. వెచ్చని నెత్తురు కలిగి ఉండే జంతువుల గాయాలపై లేదా శ్వాస నాళాల్లో ఆడ స్క్రూవామ్‌లు గుడ్లు పెడతాయి. మనుషుల గాయాలపై ఇలా గుడ్లు పెట్టడం అరుదైన అంశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో ఆడ స్క్రూవామ్‌ ఏక కాలంలో 300 వరకూ గుడ్లు పెడుతుంది. పది నుంచి 30 రోజుల దాని జీవితకాలంలో మూడు వేల వరకూ గుడ్లు పెడుతుందని సీడీసీ చెబుతున్నది. ఈ గుడ్లు లార్వా రూపం సంతరించుకుని, తమ మూతికి ఉండే పదునైన కోరలను వాడి బొరియ ఏర్పర్చుకొని జంతువు లేదా మనిషి మాంసాన్ని తింటాయి. దానితో అక్కడ పురుగుపడుతుంది. తర్వాత లార్వా నేలపై పడి.. భూమిలో బొరియలు ఏర్పర్చుకొని ఎదిగిన ఈగలుగా మారుతాయి. దీని గురించి నార్త్‌కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ ఎంటమాలజీ అండ్‌ ప్లాంట్‌ పాతాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ మాక్స్‌ స్కాట్‌ వివరిస్తూ.. ‘మాంస కణాల్లోకి స్క్రూ తరహాలో తొలుచుకుంటూ పోయేవీటి గుణాన్ని బట్టి వీటికి ఈ పేరు వచ్చింది. లాటిన్‌లో వీటిని కోక్లియోమియా హోమినివోరాక్స్ అని పిలుస్తారు. అంటే.. ‘మనిషిని తినేవి అని అర్థం’’ అని చెప్పారు.

పురుగుపట్టిన లక్షణాలేంటి?

న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌ పట్టిన చోట ప్రత్యేకించి మనుషుల్లో భరింపలేని నొప్పి ఉంటుంది. దీనికి తగిన చికిత్స అందించని పక్షంలో మరణాల రేటు అత్యధికంగా ఉంటుంది. ఒకసారి ఈ పురుగుపట్టడం మొదలైందంటే.. మరిన్ని ఈగలు దానిపై వాటి గుడ్లు పెడతాయి. ఆ గాయం ఉన్న ప్రాంతాన్ని బట్టి మెదడు వరకూ తొలుచుకుంటూ పోగలవు. గాయం పెద్దదిగా ఉన్న పక్షంలో ఆ ప్రాంతం విషపూరితం అయిపోతుందని స్కాట్‌ చెప్పారు. ఈ పారాసైట్‌ పురుగుపట్టిందంటే గాయాలు లేదా పుండ్లు ఒకపట్టాన నయం కావు. కురుపుల నుంచి రక్తస్రావం ఉంటుంది. మన శరీరంలో ఆ లార్వా కదలికలు తెలిసిపోతాయి. పురుగుపట్టిన ప్రాంతంలో చెడువాసన వస్తుంది.

ఇప్పుడెందుకు వ్యాప్తి చెందుతున్నాయి?

న్యూ వరల్డ్‌ స్క్రూవామ్‌లను అమెరికా 1966లోనే పూర్తిగా నిర్మూలించింది. ఇందు కోసం స్టెరైల్‌ ఇన్‌సెక్ట్‌ టెక్నిక్‌ను ఉపయోగించింది. ఈ పద్ధతిలో ల్యాబొరేటరీలలో క్రిమిరహిత, సంతానాన్ని నిరోధించే వేల కోట్ల స్క్రూవామ్‌లను పెంచి.. ప్రభావిత ప్రాంతాల్లో విడిచిపెట్టారు. ఆడ స్క్రూవామ్‌ స్టెరైల్‌ మగ స్క్రూవామ్‌తో జత కడితే.. ఆడ స్క్రూవామ్‌ గుడ్లు పెట్టలేదు. దాంతో వాటి జనాభా అత్యంత వేగంగా పడిపోతుంది. ఈ టెక్నిక్‌ను వాడటంతో అమెరికాలోనే కాదు.. మెక్సికో, పలు మధ్య అమెరికా దేశాల్లో కూడా ఈ భయానక పరాన్న జీవిని నిర్మూలించారు. పనామా, కోస్టారికా, నికరాగువా, హోండురాస్‌ వంటి దేశాల్లో స్క్రూవామ్‌ ప్రభావం ఉంది. స్టెరైల్‌ స్క్రూవామ్‌ ప్రభావం తగ్గిపోవడం లేదా జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోవడం వంటి కారణాలతో ఈ పరాన్న జీవి మళ్లీ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని స్కాట్‌ తెలిపారు.