school children for urea | యూరియా కోసం కన్నీరు మున్నీరు అయిన స్కూలు పిల్లాడు – నల్గొండలో హృదయ విదారక ఘటన

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూలు పిల్లలను కూడా తల్లిదండ్రులు క్యూల్లో నిలబెడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక బ్యాగు కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డా ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

school children for urea | యూరియా కోసం కన్నీరు మున్నీరు అయిన స్కూలు పిల్లాడు – నల్గొండలో హృదయ విదారక ఘటన

school children for urea | నల్గొండ: వానాకాలం సాగు చివరి దశలోకి వెళ్లినా, ఈ ఆగస్టు నెలలో రైతుల బాధలు ఆగట్లేదు. పంటలకు కావలసిన యూరియా కోసం నల్గొండ, సూర్యాపేట జిల్లాల రైతులు తీవ్రంగా అల్లాడుతున్నారు. రానురానూ తెలంగాణలో పరిస్థితి దారుణంగా మారింది. యూరియా సంచి కోసం స్కూలు వెళ్లాల్సిన పిల్లలను ఆపి, క్యూల్లో నిలబెట్టి, తల్లిదండ్రులు పనులకు వెళుతున్నారంటే, పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమౌతోంది.

సోమవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డులోని మార్కెటింగ్ సొసైటీ వద్ద స్కూలు యూనిఫాం వేసుకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మిథిలేశ్ క్యూలో కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ఉదయం 6 గంటలకు అక్కడికి చేరుకున్న అబ్బాయి, తన స్కూల్​కు ఆలస్యమవుతుందని ఇతరులను వేడుకున్నాడు. వారం రోజులుగా ఎరువులు దొరకకపోవడంతో అతని తల్లిదండ్రులు పనికి పోతూ, యూరియా బ్యాగులు తీసుకురమ్మని మిథిలేశ్​ను పంపించారు. కానీ, గంటల తరబడి లైన్లో వేచిఉన్నా, తనదాకా రాకముందే స్టాక్ అయిపోవడంతో భరించలేక కన్నీటి పర్యంతమయ్యాడు.

“యూరియా దొరకలేదని నేను అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పాను…. ఇప్పుడు లేట్​గా స్కూల్‌కి వెళ్లాల్సివస్తోంది” అని మిథిలేశ్ బాధతో అన్న మాటలు అక్కడున్న వారి హృదయాలను కలచివేశాయి.

సూర్యాపేటలోనూ పరిస్థితి దాదాపు ఇంతే. అనంతగిరి మండలంలో రైతులు తెల్లవారు జామునే క్యూలలో నిలబడటానికి తమ చెప్పులను క్యూలలో పెట్టి ‘సీటు రిజర్వ్’ చేసుకోవడం ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు ముందుగా చెప్పులను క్యూలో పెట్టి, తర్వాత  రైతులు రావడం అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెబుతోంది.

వరి, మక్కజొన్న వంటి పంటలకు యూరియా తప్పనిసరి. విత్తనాలు వేసి మొలకెత్తిన తర్వాత రెండో విడత యూరియా వేయాల్సిన ఈ సమయంలో అది అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక బ్యాగు మాత్రమే ఇవ్వడం పెద్ద రైతులకు సరిపోదు. “ఒక సంచి ఎరువుతో పెద్ద పొలాలను ఎలా కాపాడగలం? పంటను వదిలేయమంటారా?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఆగస్టు నెలలో సూర్యాపేటలో 22,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 2,300 టన్నులే వచ్చాయి. నల్గొండలో సెప్టెంబర్‌ నాటికి కావలసిన 70,000 మెట్రిక్ టన్నులలో 45,500 మాత్రమే అందించారు. ఈ కొరత రైతుల వేదనను మరింత పెంచుతోంది.

క్యూల్లో నిలబడి,  మిగతా పనులు మానేసి ఒక్క బ్యాగన్నా దొరుకుతుందేమో అన్న ఆశతో ఉన్న రైతులు, అటు యూరియా దొరకక, ఇటు పనీ పోయి విలవిల్లాడుతున్నారు. యూరియా కొరత, పరిమితి, నిర్వహణావైఫల్యం – ఇవన్నీ కలిసి రైతుల జీవితాలను మళ్లీ సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.

“మా పంటలు కాపాడుకోవడమే మా లక్ష్యం. యూరియా లేకపోతే మా కష్టాలన్నీ వృథా” అని రైతులు వేదనతో చెబుతున్నారు.