Does Gut Microbiota Affect Hypertension? | బీపీకి కారణం గట్ బాక్టీరియా?
గట్ బాక్టీరియా అసమతుల్యతతో హై బ్లడ్ ప్రెజర్. ఫైబర్, ప్రోబయోటిక్స్, ఫెర్మెంటెడ్ ఆహారాలు రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ఒత్తిడి, ఫ్యామిలీ హిస్టరీ వంటి కారణాలు రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకొంటున్నాం. తాజా పరిశోధనలు ఈ లిస్ట్ లో ఇంకో కారణాన్ని ముందుకు తెచ్చాయి. అదే.. మన గట్.
మన జీర్ణ వ్యవస్థలో లక్షల కోట్లు సూక్ష్మజీవులు ఇవి రక్తనాళాలు, మూత్రపిండాల పనితీరును, శరీరంలోని ఇన్ ఫ్లమేషన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ నేరుగా రక్తపోటుపై ప్రభావం చూపిస్తాయి.
గట్ ప్రభావం రక్తపోటుపై ఎలా ఉంటుందంటే…
అసమతుల్యమైన గట్ మైక్రోబయోమ్ రక్తపోటుపై ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మైక్రోబయోమ్‌లో మార్పులు చేస్తే నేరుగా రక్తపోటు పెరగవచ్చు లేదా తగ్గవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. గట్ నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని మాలిక్యూల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు పేగుల్లో ఉత్పత్తి అయ్యే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్లు రక్తనాళాలను సడలిస్తాయి, ఇమ్యూనిటీని నియంత్రిస్తాయి. కిడ్నీల పనితీరుకు తోడ్పడతాయి. కొన్ని పదార్థాలు ప్రమాదకరమవుతాయి. ట్రైమెథిలమైన్ ఎన్ ఆక్సైడ్ (టిఎంఎ) అనే మాలిక్యూల్ రక్తనాళాలను గట్టిగా చేస్తుంది. ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతుంది. శరీరంలో ఉప్పు నిల్వ పెరగడానికి కారణమవుతుంది. ఇవన్నీ హై బ్లడ్ ప్రెజర్‌కు దారితీస్తాయి.
గట్ బాక్టీరియా అసమతుల్యతతో…
ఫైబర్-ఫెర్మెంటింగ్ బ్యాక్టీరియా తగ్గిపోతే, రక్షకమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్లు తక్కువగా తయారవుతాయి. అదే సమయంలో ట్రైమెథిలమైన్ ఎన్ ఆక్సైడ్ (టిఎంఎ) ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా పెరుగుతాయి. దీని వలన టిఎంఎఒ స్థాయిలు పెరిగి, రక్తనాళాలు గట్టిపడతాయి. తద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. “లీకీ గట్” పరిస్థితిలో పేగుల నుంచి బ్యాక్టీరియా టాక్సిన్లు రక్తంలోకి చేరతాయి. ఇది శరీరంలో నిరంతరం ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతుంది. కాలక్రమేణా ఇది రక్తపోటు నియంత్రణను మరింత కష్టతరం చేస్తుంది. ఫలితంగా హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కిడ్నీల సమస్యలు పెరుగుతాయి.
గట్-ఫ్రెండ్లీ ఫుడ్ తో బీపీ కంట్రోల్ ?
నిజానికి సరైన జీవనశైలి మార్పులు ఈ సమస్యను తగ్గించగలవు. ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే డైట్స్, ఫెర్మెంటెడ్ ఆహారాలు వాడితే రక్తపోటు కొద్దిగా తగ్గుతుందని క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయి. స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించగలదు. ప్రోబయోటిక్స్ లో కూడా ఒకే బ్యాక్టీరియా జాతికన్నా, ఎక్కువ రకాల బాక్టీరియా మరింత ప్రభావవంతంగా ఉంటాయి. అయితే ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయాలు కావు. ఇవి కేవలం సహాయక మార్గాలు మాత్రమే.
గట్ ఫ్రెండ్లీ బాక్టీరియా కోసం..
గట్ కి మేలు చేసే మైక్రోబయోమ్ పెంచుకోవడానికి డాష్ (డిఎఎస్ హెచ్) డైట్, మెడిటేరనియన్ డైట్స్ కీలకమైనవి. ఈ రెండింట్లో పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, గింజలు, విత్తనాల వంటి ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డైట్స్ లో అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా తక్కువ. ఈ ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరగడానికి సహాయపడటం ద్వారా రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యోగర్ట్, సంప్రదాయ కూరలు, ఫెర్మెంటెడ్ ఆహారాలు కూడా గట్ మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని మరింత పెంచుతాయి.
ఎలాంటి గట్ సమస్యలుంటే బీపీ సమస్య?
మైక్రోబయోమ్ కారణంగా వచ్చిన హై బ్లడ్ ప్రెజర్‌ను గుర్తించే ప్రత్యేక లక్షణాలు లేవు. కానీ బ్లోటింగ్, మలబద్ధకం లేదా డయేరియా, అలసట, మూడ్ మార్పుల వంటి లక్షణాలు ఉంటూనే రక్తపోటు అకస్మాత్తుగా నియంత్రణ తప్పితే.. గట్ కూడా ఒక కారణం కావచ్చని అనుకోవాలంటున్నారు డాక్టర్లు. అంతేగాక, అకారణంగా బరువు పెరగడం, శరీరంలో నీరు పేరుకుపోవడం, నిద్రలో సమస్యలు, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. బ్లడ్ ప్రెజర్ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు.