Hepatitis A vaccine | హెపటైటిస్ ఎ… వ్యాక్సిన్ అవసరమా?
హెపటైటిస్ ఎ వైరస్‌పై ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 90% మంది చిన్న వయస్సులోనే ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. వ్యాక్సిన్ అవసరం ప్రాంతాల వారీగా నిర్ణయించాలన్న సూచన.

Is Hepatitis A vaccine necessary in India? ICMR study reveals new risk for adults
Hepatitis A vaccine | హెపటైటిస్ ఎ గురించి ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో హెపటైటిస్ ఎ చాలా తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించిన స్టడీని “ది లాన్సెట్” జర్నల్ ప్రచురించింది.
14 వేల 7 వందల 78 మంది పై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీళ్లలో 6 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులున్నారు. వీళ్ల రక్త నమూనాలను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా సగటుగా 90% మంది భారతీయులు చిన్న వయసు లోనే హెపటైటిస్ ఎ వైరస్ ఇన్ఫెక్షన్కి గురయ్యారు. అయితే కేరళలో కేవలం 44.8% మందికి మాత్రమే హెచ్ ఏ వీ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. కేరళ రాష్ట్రంలోని ఇళ్లల్లో ఎక్కువ శాతం మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్య సేవల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల చిన్నతనంలో హెచ్ఏవీకి గురయ్యే అవకాశం కేరళలో తక్కువగా ఉందని అధ్యయనకారులన్నారు.
హెపటైటిస్ ఎ : తక్కువ ఎక్స్పోజర్.. కొత్త ప్రమాదం
అయితే ఈ విజయానికి మరోవైపు ఒక కొత్త సవాలు ఉంది. కేరళలో చిన్న వయస్సులో సోకడం తక్కువగా ఉండటం వల్ల పెద్ద వయసు ప్రజలకు ఈ వైరస్ తొందరగా సోకుతోంది. అంటే పెద్దవాళ్లకు ఇన్ఫెక్షన్ వస్తే అది తీవ్రమైన రూపంలో ఉండే ప్రమాదం ఉంది.
హెపటైటిస్ ఎ అంటే..
హెపటైటిస్ ఎ అనేది ప్రధానంగా కాలేయాన్ని ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన నీరు, ఆహారం లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగా లేనిచోట, నీటి పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో పిల్లలకు చిన్న వయస్సులోనే ఈ వైరస్ సోకుతుంది. కామెర్లు, వాంతులు, కడుపు నొప్పి లాంటి లక్షణాలుంటాయి. వ్యాధి తీవ్రమైతే కాలేయం దెబ్బతినవచ్చు.
వ్యాక్సిన్ అవసరమా?
ప్రపంచవ్యాప్తంగా 2021 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం, 160 మిలియన్ హెచ్ ఏ వీ కేసులు, 27 వేల మరణాలు నమోదయ్యాయి. అందులో 20% కేసులు, 50% మరణాలు భారత్ లోనే చోటు చేసుకున్నాయి. భారత నగరాల్లో జరిపిన పలు అధ్యయనాల ప్రకారం, పిల్లలు మరియు పెద్దల్లో హెపటైటిస్ ఎ కారణంగా 21.4% నుండి 65.9% వరకు తీవ్ర కాలేయ వైఫల్యం కేసులు వస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాక్సిన్ తీసుకోవడం అవసరం అనే చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. భారతదేశంలో ఇప్పుడు హెచ్ఏవీ మధ్యస్థ వ్యాప్తి దశలో ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వ్యాక్సినేషన్‌పై ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.