Health Tips | వడదెబ్బ సమస్య ఇబ్బంది పెడుతోందా.. ఈ పానీయాలతో తక్షణమే ఉపశమనం పొందండి..!

Health Tips | వడదెబ్బ సమస్య ఇబ్బంది పెడుతోందా.. ఈ పానీయాలతో తక్షణమే ఉపశమనం పొందండి..!

Health Tips : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండ‌లు మండిపోతున్నాయి. ఉద‌యం పది గంట‌ల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే ఈ ఎండలు ఆరోగ్యానికి హానికరం. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వ‌డ‌దెబ్బ త‌గలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ ప‌రిస్థితి రాకూడ‌దంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ‌రీరాన్ని చ‌ల్లబ‌రిచే పానీయాలు ఎక్కువ‌గా తీసుకోవాలి. మ‌రి ఆ పానీయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చల్లచల్లని పానీయాలు..


చ‌ల్ల : పెరుగులో కావాల్సిన‌న్ని నీళ్లు పోసుకుని గిల‌కొట్టి చ‌ల్ల చేసుకోవాలి. ఈ చ‌ల్లలో కొంచెం ఉప్పు, క‌రివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు త‌గ్గిపోతుంది.


జ‌ల్‌జీరా: ‌నాలుగు చెంచాల ఆమ్‌చూర్ పొడి, అంతే ప‌రిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీల‌క‌ర్ర పొడి, రెండు చెంచాల న‌ల్ల ఉప్పు, చ‌క్కెర‌, అర చెంచా మిరియాల పొడి క‌లిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చ‌ల్లటి నీళ్లలో క‌లిపితే జ‌ల్‌జీరా మిశ్రమం రెడీ అవుతుంది. అది తాగితే డీ హైడ్రేష‌న్ స‌మ‌స్య వెంట‌నే త‌గ్గిపోతుంది.


కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విప‌రీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అక‌స్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవ‌హిస్తుంది. ఇలాంటి సంద‌ర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే త‌క్షణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


ష‌ర్బత్‌: వేస‌విలో బాడీని డీ హైడ్రేష‌న్ నుంచి కాపాడుకోవ‌డంలో ష‌ర్బత్ బాగా ప‌నిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో స‌గం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్‌ల చ‌క్కెర క‌లుపుకుని ష‌ర్బత్ చేసుకుని తాగొచ్చు.