నెలపాటు మాంసాహారం తినకపోతే శరీరంలో జరిగే మార్పులివే!

మాంసాహారాలు, ప్రత్యేకంచి శుద్ధి చేసిన(ప్రాసెసెడ్) మాంసాహారాలు తినడం ద్వారా మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి.

  • By: Somu    health    Dec 02, 2023 11:25 AM IST
నెలపాటు మాంసాహారం తినకపోతే శరీరంలో జరిగే మార్పులివే!

విధాత‌: మాంసాహారాలు, ప్రత్యేకంచి శుద్ధి చేసిన(ప్రాసెసెడ్) మాంసాహారాలు తినడం ద్వారా మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. వాటిల్లో ముఖ్యంగా శరీర ఆకారం, సైజు పెరిగే అవకాశం బాగా ఉంది. వెజిటేరియనిజం (శాకాహారం) నేటి ప్రపంచంలో పెరుగుతున్న ధోరణి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన తాజా సర్వే పేర్కొంటున్నది. అది గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకంగా అమెరికాలోనూ, యూరప్‌లోనూ విశేషాదరణ పొందుతున్నది.


ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ ఏక్తా సింగ్ వాల్ ఎంఎస్‌సీ డైటీషియన్ తెలియజేస్తున్న వివరాల ప్రకారం అనేక కారణాల వల్ల చాలామంది మాంసాహార ప్రియులు క్రమంగా వేగనిజం లేదా వెజిటేరియన్ (శాఖాహారం) వైపు మరలుతున్నారు. దానికి మన చుట్టూ వున్న పర్యావరణములో వస్తున్న మార్పులు ఒక కారణమైతే, నైతిక విలువలు పెరగడం మరో కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా శాకాహార- సంబంధిత ఉత్పాదితాలు విరివిగా దొరకడం శాకాహారం వైపు మళ్లడానికి కారణమవుతున్నది.


మాంసాహారం తినడం ఒక నెలపాటు ఆపేస్తే.. అనేక ఆరోగ్య లాభాలు వున్నాయని డాక్టర్ ఏక్తాసింగ్‌ వాల్ చెబుతున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండడం ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాల వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం అందులో ఒకటని పేర్కొంటున్నారు. శాకాహారం గుండెకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. టైప్ 2 డయాబెటీస్‌ను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. కొన్నిరకాల క్యాన్సర్లను అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల శాకాహారం (వెజిటేరియన్ ఫుడ్స్) అలవాటు చేసుకుంటే అవసరమైన ప్రొటీన్స్‌, మినరల్స్ విటమిన్స్ పొందగలుగుతాము.


ఒక నెల మాంసాహారం తినకపోతే మన శరీరంలో కలిగే ఐదు ముఖ్య మార్పులు..


(1) జీర్ణశక్తి పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) తగినంత ఉండటం ద్వారా జీర్ణశక్తి పెరగుతుంది. తీసుకున్న ఆహారం సరైన విధంగా జీర్ణమై.. పోషకాలు శరీరానికి అందుతాయి. మిగిలిన విషపదార్థాలు క్రమం తప్పకుండా విసర్జించబడతాయి. మన కడుపు, ప్రేగులు, శుభ్రంగా ఉండటం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. దీనితో ఆరోగ్యంగా, హుషారుగా ఉండగలుగుతాం.


(2) శాకాహారం అలవాటు చేసుకోవడం ద్వారా శరీర బరువును సమతుల్యంగా ఉంచుకోవచ్చు. అదనపు బరువును వదిలించుకోవచ్చు. డాక్టర్ సింగ్ వాల్ ప్రకారం మాంసాహారంతో పోల్చుకున్నప్పుడు శాకాహారంలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అదనంగా తినాల్సిన అవసరం లేకుండా కొంత తినంగానే నిండినట్లు అనిపిస్తుంది. అదనపు క్యాలరీలను తినే అవకాశం ఉండదు. ఆ విధంగా శరీర బరువును తగ్గించు కోవచ్చు.


(3) మాంసాహారం వలన మన శరీరంలో తట్టుకోలేని కొన్ని మార్పులు వచ్చి దురద, వాపు నొప్పులు, అజీర్ణం వంటి ఎలర్జీ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వీటి వల్ల కాలేయం, గుండె, మూత్ర పిండాలలో ఒత్తిడి పెరిగి, దీర్ఘకాల రోగాల బారిన పడే ప్రమాదం వుంది. శాకాహారం వలన ఈ ప్రమాదం తక్కువ.


(4) కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. మాంసాహారం వల్ల శరీరంలో నష్టాన్ని కలిగించే కొవ్వు పేరుకుపోయే అవకాశం బాగా ఉంది. కొలెస్ట్రాల్ పెరగటం ద్వారా గుండెపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శాకాహారం వల్ల ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యంగా వుండవచ్చు.


(5) శాకాహారం వల్ల శరీరంలో పుష్కలంగా యాంటిఆక్సిడెంట్సు లభిస్తాయి. ఇవి శరీరాన్ని రక్షించడంలోనూ, శరీర మార్పులను, ఒత్తిళ్లను నియంత్రిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆహారంలో కూరగాయల్ని, వివిధ ధాన్యాలు, నట్స్‌, గింజలను, విత్తనాలను తినటం ద్వారా అవసరమైన యాంటిఆక్సిడెంట్సు శరీరానికి అందుతాయి. ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా వున్న యాంటిఆక్సిడెంట్ల ద్వారా శరీర అవయవాలు శక్తమంతంగా, హుషారుగా పనిచేస్తాయి.