అసెంబ్లీలో బస్వాపురం నిర్వాసితుల సమస్యలపై కుంభం గళం

బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో ఎమ్మెల్యే కుంభం ప్రస్తావించారు. పెండింగ్ ఆర్&ఆర్ నిధులు విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో బస్వాపురం నిర్వాసితుల సమస్యలపై కుంభం గళం

విధాత : భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై తన గళం వినిపించారు. బస్వాపురం ప్రాజెక్టు ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీలు, అసంపూర్తి పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దీంతో పెండింగ్ లో ఉన్న పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలుమార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు చేసి కొంతవరకు ఇప్పటికే పరిష్కార చర్యలు తీసుకున్నారన్నారు. రూ.30కోట్ల వరకు నిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిపారు. దీంతో కొంత మేరకు రిజర్వాయర్ లో నీళ్లు నింపే అవకాశం ఏర్పడిందన్నారు.

ముఖ్యంగా వరంగల్ – హైదరాబాద్ మార్గంలో రాయగిరి వద్ద బైపాస్ రోడ్డు కటింగ్ చేసి కల్వర్టు నిర్మించడం ద్వారా కాలువకు నీళ్లు విడుదల చేసే మార్గం సుగమం చేశారన్నారు. దీంతో బునాదిగాని కాలువలోకి గోదావరి నీళ్లు పారుతూ భువనగిరి, వలిగొండ మండలాల్లోని 20కి పైగా చెరువులు, కుంటలు నిండే అవకాశం ఏర్పడిందన్నారు. ఇందుకు మంత్రి ఉత్తమ్ కు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. అయితే అక్కడక్కడ కాలువలపై ఓటీలు, ఫీడర్ కెనాల్స్ నిర్మించాల్సి ఉందన్నారు. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.134కోట్లు పెండింగ్ నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని విడుదల చేసి నిర్వాసితులను ఆదుకుని, రైతులకు సాగునీటిని అందించి మేలు చేయాలని కోరారు.

ఇటు భువనగిరి – నల్లగొండ మార్గంలో బస్వాపురం కెనాల్ అసంపూర్తి పనులు పూర్తి చేస్తే వలిగొండ మీదుగా రామన్నపేట, చిట్యాల వరకు గోదావరి నీళ్లు వెలుతాయని అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశంలు బస్వాపురం ప్రాజెక్టు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ, అసంపూర్తి పనులపై అడిగిన ప్రశ్నలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 5,000వేల కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. జూన్ మాసం లోపల భూసేకరణ, ఆర్ ఆండ్ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తాం అని తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీలకు సంబంధించిన పెండింగ్ నిధునలు ఒకటి రెండు నెలల్లో విడుదల చేస్తామని, సభ్యులు లేవనెత్తిన పనులకు సంబంధించి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాకౌట్
ఖమ్మం.. నల్లగొండ మంత్రులే టార్గెట్ గా బీఆర్ఎస్ ఎటాక్ !