హైదరాబాద్ : బీజేపీ డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని, అసలు ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదని ప్రశ్నించారు. 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని.. దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారని విమర్శించారు. మంగళవారం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో పాల్గొని నివాళులు అర్పించి ప్రసంగించారు.
గాంధీ, అంబేద్కర్ లు దేశానికి రెండు కళ్లలాంటివారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని మార్గదర్శనం చేశారు అని కొనియాడారు. విద్య వ్యక్తితో పాటు దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తుందని అంబేద్కర్ చాటారన్నారు. ప్రజల కలలు సాకారం చేసేందుకు మా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుంది’’ అని సీఎం అన్నారు. గత ప్రభుత్వం కులాల వారిగా పాఠశాలలను ఏర్పాటు చేసి సమాజంలో విభజన రేపితే…మేం యంగ్ ఇండియా స్కూల్స్ తో అందరికి సమానమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, మైనార్టీ, ఆదివాసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. దళిత బిడ్డ భట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే బీఆర్ఎస్ అవమాస్తుందని, స్పీకర్ గా ఉన్న దళితుడిని అధ్యక్షా అని పిలిచే ఇష్టం లేక కొందరు సభకు రావడం లేదన్నారు. 110ఏళ్ల ఉస్మానియా, అంబేద్కర్ యూనివర్సిటీలకు దళితులే వైస్ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, 67వేల ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ జరిగితే 87శాతం ఉద్యోగాలు బడుగు, బలహీన వర్గాల వారికే దక్కాయన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఏకైక రాష్ట్రం, ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు, తప్పులు పరిష్కరించుకుంటూ వెలుతుంటే.. మా ప్రభుత్వంపై కొందరు వెనుక నుంచి కుట్రలు చేస్తున్నారని అటువంటి వారి భరతం ప్రజలు పట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడే ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనన్నారు.
ఇవి కూడా చదవండి :
బాబోయ్.. భారీ కింగ్ కోబ్రాలు!
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాన్సువాడ ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం
