Jubilee Hills Congress | జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ షార్ట్‌లిస్ట్‌ సిద్ధం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితా సిద్ధం చేసింది. నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, గద్దం వివేక్‌, తుమ్మాల నాగేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ ఏఐసీసీకి నివేదిక సమర్పించింది.

Jubilee Hills Congress | జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ షార్ట్‌లిస్ట్‌ సిద్ధం

Congress Ministers Committee Shortlists Four Names For Jubilee Hills Bypoll; Focus On BC Representation

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (విధాత‌):
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ తుది దశ చర్చల తర్వాత నలుగురు అభ్యర్థుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసి ఏఐసీసీకి పంపింది. ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, గద్దం వివేక్‌, తుమ్మాల నాగేశ్వరరావు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపి, సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఫైనల్‌ లిస్ట్‌లో వీ. నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, మాజీ ఎంపీ ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌లకు శనివారం సమర్పించారు. కమిటీ నివేదిక ప్రకారం, జూబ్లీహిల్స్‌లో బీసీ వర్గాల ఓటర్లు అధికంగా ఉండటంతో, బీసీ అభ్యర్థినినే ఎంపిక చేయాలని సూచించింది.

Jubilee Hills congress list candidates. Naveen yadav, Bonthu Rammohan, Anjan kumar yadav, CN Reddy
ఈ నియోజకవర్గంలో మొత్తం 3.93 లక్షల ఓటర్లలో సుమారు 1.4 లక్షలు బీసీ వర్గాలకు చెందినవారు.
వాటిలో మున్నూరు కాపులు 22,000, యాదవులు 15,000, ముదిరాజులు 13,500, పద్మశాలీలు 12,000, వడ్డేర్లు 15,000, గౌడులు 15,000, విశ్వబ్రాహ్మణులు 13,000, కమ్మారులు 9,600, రాజకాలు మరియు ఇతరులు 13,000 మంది ఉన్నట్లు వివరాలు తెలిపాయి.

జూబిలీహిల్స్​ లిస్టులో ఉన్న అభ్యర్థుల వివరాలు

నవీన్‌ యాదవ్‌ – 2014లో AIMIM తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. తరువాత 2023 నవంబరులో కాంగ్రెస్‌లో చేరారు.

బొంతు రామ్మోహన్‌ – మాజీ GHMC మేయర్‌ (2016–2021).
2024 ఫిబ్రవరిలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, సుస్థిరమైన సంస్థాగత అనుభవం కలిగిన నేత. మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయనకు, యాదవ వర్గం మద్దతు కూడా ఉన్నట్లు పార్టీ అంచనా.

సీఎన్‌ రెడ్డి – బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా 2020లో రహ్మత్‌నగర్‌ నుంచి గెలిచి, 2023 నవంబరులో కాంగ్రెస్‌లో చేరారు.

ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌ – మాజీ ఎంపీ, 2004–2009లో రెండుసార్లు సికింద్రాబాద్‌ పార్లమెంటు నుంచి గెలిచారు.
2023లో ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు ఎం. అనిల్‌కుమార్‌ యాదవ్‌ 2024 ఏప్రిల్‌లో ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అక్టోబర్‌ 6 లేదా 7న ఢిల్లీలో మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ గౌడ్‌లతో సమావేశమై ఈ జాబితాను ముగ్గురికి కుదించి హైకమాండ్‌కు పంపిస్తారని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని పార్టీ అంచనా వేస్తోంది.

కాగా, బిఆర్​ఎస్​ అభ్యర్థి విషయంలో ముందుంది. సిట్టింగ్​ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్​ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో ముందుంది. ఇక బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికలో ఇంకా  మల్లగుల్లాలు పడుతోంది.

జూబ్లీహిల్స్‌ సీటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ గెలుపు సాధిస్తే హైదరాబాదులో పార్టీ పట్టు బిగించవచ్చని నేతలు భావిస్తున్నారు.