Common Duct System GHMC | ఎడాపెడా తవ్వకాలకు ఫుల్‌స్టాప్‌.. గ్రేటర్ హైదరాబాద్‌లో దశలవారీగా కామన్ డక్ట్!

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎడాపెడా రోడ్ల తవ్వకాలకు ఇక చెక్‌ పడనుంది. తవ్వకాలను నివారించేందుకు మహానగరంలో కామన్‌ డక్ట్‌ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. దీనిని దశలవారీగా నగరం మొత్తం ఏర్పాటు చేయనున్నారు.

  • By: TAAZ |    hyderabad |    Published on : Dec 21, 2025 8:25 PM IST
Common Duct System GHMC | ఎడాపెడా తవ్వకాలకు ఫుల్‌స్టాప్‌.. గ్రేటర్ హైదరాబాద్‌లో దశలవారీగా కామన్ డక్ట్!

Common Duct System GHMC | గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం ఏదో ఒక ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు కంపెనీలు రోడ్ల తవ్వకాలు చేపడుతున్నాయి. పైపులైన్ కోసం లేదా కేబుళ్లు వేయడం కోసం చేపడుతున్న తవ్వకాలు ప్రజలు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. రాత్రిపూట వెళ్తున్న పాదచారులు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. నెలల తరబడి తవ్విన గుంతలు పూడ్చకపోవడంతో రోడ్లపై వాహనదారులు గాయాలపాలవుతున్నారు. కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులపై విద్యుత్ ఓపెన్ లైన్ల కారణంగా కూడా అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో టీజీ ఎస్సీడీసీఎల్ అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల పనులు ప్రారంభించింది. దీని వెంటే ఆఫ్టిక్ ఫైబర్ లైన్ల కోసం ప్రత్యేక పైపులైన్లు వేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ముంబై, బెంగళూరు నగరాల్లో కామన్ డక్ట్‌లు వేసి ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్టీఎస్ఎస్) కింద నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దశల వారీగా పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇవన్నీ పూర్తయితే నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తవ్వకాల పనులు దాదాపు తగ్గుముఖం పడతాయి. కేవలం మంచినీటి పైపులైన్లు, మురుగునీటి పైపులైన్ల లో లీకేజీలు ఏర్పడినప్పుడు లేదా విస్తరించే సమయంలో మాత్రమే తవ్వకాలు చేపట్టనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. విస్తరించిన హైదరాబాద్ మహా నగరంలో రోడ్డు తవ్వకాలను తగ్గించాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. నగరంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ రూ.13,500 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విద్యుత్ అంతరాయాలను నివారించండం, భద్రతను పెంచడం, నిర్వహణ వ్యయం తగ్గించడం ప్రధాన ఉద్ధేశ్యం. వర్షాకాలం సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడ్డం. నగర వ్యాప్తంగా 25వేల కిలో మీటర్ల పొడవునా ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. వీటన్నింటిని అండర్ గ్రౌండ్ కేబుల్ గా మార్చే పనులు జరుగుతున్నాయి.

బెంగళూరు మహా నగరం తరహాలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు ధ్వంసం కాకుండా ఆధునిక డ్రిల్లింగ్ విధానాలను అమలుపరుస్తున్నారు. అయితే కేబుల్ వేయడానికి 4 నుంచి 6 మీటర్ల లోతులో తవ్వాల్సి ఉంటుంది. రెండు మూడు మీటర్ల లోతులో వేస్తే భవిష్యత్తులో పైకి తేలితే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అండర్ గ్రౌండ్ కేబుల్ తో వర్షాలు, తుఫానుల సమయంలో విద్యుత్ సరఫరా నిరంతరంగా జరుగుతుంది. విద్యుత్ స్థంభాలు, వేలాడే తీగలు లేకపోవడం మూలంగా నగరం అందం పెరగడంతో పాటు విద్యుత్ సిబ్బందికి ప్రమాదాలు తప్పుతాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సర్కిల్ లో రూ.4,051 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ కేబుళ్ల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలలో 11కేవీ, 33కేవీ ఓవర్ హెడ్, ఎల్.టి ఓవర్ హెడ్ లను తొలగించి వాటి స్థానంలో కేబుళ్లు వేస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో కామన్ డక్ట్ సాధ్యం కాని పరిస్థితిలో ఓపెన్ బంచ్ కేబుళ్లను వేయనున్నారు.

గ్రేటర్ పరిధిలో 60 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 52 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. మిగతా కనెక్షన్లు కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలోకి వస్తాయి. సాధారణ రోజులలో ప్రతి నిత్యం 60 నుంచి 65 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, వేసవిలో సగటున 85 నుంచి 90 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. 33కేవీ సబ్ స్టేషన్లు 498 ఉంగా 33కేవీ అండర్ గ్రౌండ్ కేబుళ్లు 1,280 కిలో మీటర్లు వేశారు. ఇంకా 3,725 వేయాల్సి ఉంది. 11కేవీ కేబుళ్లు 957 కిలోమీటర్లు ఉండగా 21,643 కిలోమీటర్ల దూరం వేయాల్సి ఉంది.

Read Also |

Anaconda Viral Video| అమెజాన్ నదిలో అనకొండతో ఆటలా..వీడియో వైరల్
King Cobra in farm| ఆమె పొలం..కింగ్ కోబ్రాల నెలవు!
8000 Applicants For Home Guard Post : నిరుద్యోగం ఎఫెక్ట్…హోంగార్డు పోస్టులకు పీజీ నిరుద్యోగుల క్యూలైన్స్!