మియాపూర్ వెళ్లేవారు అనుభవించే ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని తొలగించేందుకు సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకూ కొత్తగా ఫ్లైవోవర్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఫ్లైవోవర్‌తో హైదరాబాద్ వాయవ్య ప్రాంత ట్రాఫిక్ కష్టాలు కొంత మేరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. 530 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
- ఆల్విన్ కాలనీలోని సీఎంసీ ఏరియా నుంచి మియాపూర్ వరకూ ఫ్లైవోవర్
- అంజయ్య నగర్, దాని సమీప రద్దీ ప్రాంతాల మీదుగా ఈ ఫ్లైవోవర్ సాగుతుంది.
- మొత్తం 1.8 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తారు.
- ఈ కారిడార్.. 24 మీటర్ల వెడల్పుతో, ఆరు లేన్లలో నిర్మాణం కానున్నది.
- ఫలితంగా వాహనాలు సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండా, వేగంగా ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు.
తొలుత నిర్వహించే భూమిపనులు కలుపుకొని మొత్తం 330 కోట్లతో ఈ ఫ్లైవోవర్‌ను నిర్మించనున్నారు. భూసేకరణ, పునరావాసం కోసం రెండు వందల కోట్లను ప్రభుత్వం కేటాయించనున్నది. ఈ ఫ్లైవోవర్ నిర్మాణం అతి త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట సర్వే నిర్వహించి, అనుమతుల ప్రక్రియ పూర్తి చేసుకుని, నిర్మాణం ప్రారంభించనున్నారు.
మియాపూర్ వైపు వెళ్లేవారికి ఉపశమనం
కొత్తగా నిర్మించే ఈ ఫ్లైవోవర్.. మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు వైపు వెళ్లే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలానగర్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, నిజాంపేట వద్ద ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. ప్యాసింజెర్ వెహికల్స్‌తోపాటు సరుకు రవాణాను సులభతరం చేయనున్నది. సమీపంలోని పారిశ్రామిక, నివాస ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది ఎంతగానో దోహదం చేయనున్నది. ఇది నిర్మాణం పూర్తి అయితే.. హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతానికి రోడ్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం బాలా నగర్ నుంచి మియాపూర్, పటాన్ చెరు వైపు వెళ్లేవారు నిత్యం ట్రాఫిక్ నరకాన్ని ఎదుర్కొంటున్నారు. యూటర్న్‌ల వద్ద వాహనాలు స్తంభించిపోవడంతో.. వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ ఫ్లైవోవర్ నిర్మాణంతో ఈ సమస్యలు చాలా వరకూ తగ్గిపోతాయని అధికారులు చెబుతున్నారు.
