H1B Visa Scam | హెచ్1బీ వీసా ఫ్రాడ్.. అమీర్‌పేట్‌లో నకిలీ సర్టిఫికెట్ల విక్రయం.. వాటితో చెన్నై కాన్సులేట్‌లో వీసాలు!
నకిలీ సర్టిఫికెట్లకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నవే. అయితే.. ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా చెన్నైలోని అమెరికా కాన్సులేట్ నుంచి వీసాలు పొందుతున్నారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
H1B Visa Scam | హెచ్1బీ వీసాల రగడ ఇప్పట్లో ఆగేలా లేదు. భారత్ నుంచి కుప్పలు తెప్పలుగా వస్తున్న నైపుణ్యంలేని నిపుణులను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధనలు కఠినం చేసిన విషయం తెలిసిందే. ఈ వీసాల జారీ కి వార్షిక ఫీజును ఒక లక్ష డాలర్లకు పెంచడంతో గగ్గోలు మొదలైంది. ట్రంప్ నిర్ణయాల అగ్నికి ఆజ్యం పోసే విధంగా మాజీ యూఎస్ రిప్రజెంటేటీవ్, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత దేశం నుంచి వచ్చే వారికి పరిమితికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది అమెరికా దేశానికి చెడు చేస్తున్నదని, స్థానికులను పొట్టగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
స్టీవ్ బాన్నన్ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో మాజీ యూఎస్ రిప్రజెంటేటీవ్, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ మాట్లాడుతూ, భారత్ కు కేటాయించిన వీసాలకు అధిక స్థాయిలో మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. హెచ్1బీ వీసాను ఇండస్ట్రియల్ స్కేల్ ఫ్రాడ్ గా ఆయన అభివర్ణించారు. అనుమతించిన దానికి మించి వీసాలు జారీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా దేశం ప్రతి సంవత్సరం అనుమతించిన హెచ్1బీ వీసా కోటాలో 71 శాతం కేవలం భారత్ నుంచే జారీ అవుతున్నాయని, 12 శాతం చైనా దేశం నుంచి ఇస్తున్నారన్నారు. భారత్ కు 85వేల హెచ్1బీ వీసాల పరిమితి విధించగా, కేవలం చెన్నై కేంద్రంగా ఉన్న అమెరికా కాన్సులేట్ నుంచి 2,20,000 మంది ఎలా పొందగలిగారో అర్థం కావడం లేదన్నారు. రెండున్నర రెట్లు అధికంగా అనుమతించారంటే అదో పెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. ఇలా లెక్కకు మించి ఇష్టానుసారంగా ఇవ్వడం మూలంగా అమెరికలోని నిపుణులకు పెద్ద ముప్పు ఏర్పడుతున్నదని డేవ్ బ్రాట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వచ్చేవాళ్లందరూ తాము నైపుణ్యత కలిగిన వాళ్లమని భ్రమ పడతారని, వాస్తవానికి వాళ్లందరూ ఫ్రాడ్ చేసి, తప్పుడు సర్టిఫికెట్లతో వస్తున్నారన్నారు. ఇలా వచ్చినవారందరూ అమెరికన్ల ఉద్యోగాలు గుంజుకుంటన్నారని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారని, ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 2024 సంవత్సరంలో చెన్నై అమెరికా కాన్సులేట్ 2.20 లక్షల హెచ్1బీ వీసాలు జారీ చేయగా, దీనికి అదనంగా 1.4 లక్షల హెచ్4 డిపెండెంట్ వీసాలు జారీ అయ్యాయన్నారు. ఈ కాన్సులేట్ పరిధిలోకి తమిళనాడు రాష్ట్రంతో పాటు కర్నాటక, కేరళ, ఏపీ తో పాటు తెలంగాణ నుంచి కూడా వస్తారన్నారు. ప్రపంచంలోనే చెన్నై కాన్సులేట్ అత్యంత రద్దీ హెచ్1బీ వీసా ప్రాసెసింగ్ కార్యాలయం అని ఆయన వివరించారు.
అమీర్ పేటలో కుప్పలు తెప్పలుగా దొంగ షాపులు
రెండు దశాబ్ధాల క్రితం చెన్నై లోని అమెరికా కాన్సులేట్ లో యూఎస్ ఫారిన్ సర్వీసు అధికారిగా పనిచేసిన మహవశ్ సిద్ధిఖీ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు గతంలో చేశారు. భారత మూలాలు ఉన్న ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు అర్హత సర్టిఫికెట్లతో హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని అన్నారు. 2005 సంవత్సరంలో ఇలాంటి వీసాల కోసం 51వేల మంది దరఖాస్తు చేసుకోగా 90 శాతం తప్పుడు దరఖాస్తులేనని ఆమె అన్నారు. ఇందులో దొంగ డిగ్రీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినవారు ఉన్నారని, నైపుణ్యం కలిగిన వారు కూడా కాదన్నారు. హైదరాబాద్ నగరంలోని అమీర్ పేటలో పుట్టగొడుగుల్లా ఐటీ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని, షాపులలో సరకులు విక్రయించిన విధంగా వీసాల కోసం ఫేక్ ఎంప్లాయిమెంట్ లెటర్లు, విద్యా అర్హత, మ్యారేజి డాక్యుమెంట్లను తయారు చేస్తారన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టి నిరోధించేందుకు ప్రయత్నించగా, రాజకీయంగా వచ్చిన ఒత్తిడితో అప్పట్లో అమలు చేయలేకపోయామన్నారు. భారత్ లో ఏ పని అయినా డబ్బులు ముట్టచెబితే అయిపోతుందని, ఇది సర్వ సాధారణమన్నారు. వీసా ఇంటర్వ్యూ సమయంలో అసలైన అభ్యర్థుల బదులు వారిని పోలిన నకిలీలను పంపిస్తుంటారని ఆరోపించారు. ఇలా సమకూర్చే సంస్థలు కూడా భారత్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, దరఖాస్తుదారుల నుంచి దళారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తారని ఆమె అన్నారు.
Read Also |
Sleep Deprivation : సరిగ్గా నిద్రపోవట్లేదా?.. మీ బ్రెయిన్‌కు భారీ నష్టం తప్పదు
NBK 111 | బాలయ్య అభిమానులకి మరో పండుగ.. ఇక యోధుడిగా సందడే సందడి
Local Body Elections | పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సర్పంచుల జీతంపై సర్వత్రా చర్చ..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram