హైదరాబాద్ నుంచి ముంబైకి 3 గంటల్లోనే.. 671 కి.మీల బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం
హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌కు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది. మొత్తం 671 కి.మీ మార్గంలో తెలంగాణ పరిధిలో 93 కి.మీ భూసేకరణ జరగాల్సిఉంది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణం కేవలం 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది.
Telangana Bullet Train Project Moves Ahead: Hyderabad-Mumbai DPR Ready, Land Acquisition Next
కీలక అంశాలు
- హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం
- మొత్తం మార్గం 671 కిలోమీటర్లు.. తెలంగాణలో 93 కి.మీ
- హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 3 గంటలే
- కోకాపేట, జహీరాబాద్ ప్రాంతాలు కీలక స్టేషన్ పాయింట్లుగా ప్రతిపాదన
Hyderabad – Mumbai Bullet Train | హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. మొత్తం 671 కిలోమీటర్ల మార్గానికి డీపీఆర్ సిద్ధమైనట్లు రైల్వే అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణ సమయం 12–14 గంటల నుంచి కేవలం 3 గంటలకు తగ్గే అవకాశం ఉంది.
విధాత సిటీ డెస్క్ | మే 19, 2026:
హైదరాబాద్: తెలంగాణ రవాణా రంగంలో మరో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. మొత్తం 671 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ బుల్లెట్ రైలు మార్గం మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలను అనుసంధానించే ఈ కారిడార్ ద్వారా దక్షిణ, పశ్చిమ భారతదేశాల మధ్య వేగవంతమైన రవాణాకు కొత్త దారులు తెరుచుకోనున్నాయి. గంటకు దాదాపు 300 కి.మీల వేగంతో ప్రయాణించే ఈ రైలు ముంబైకి 2 గంటల 55 ని.ల నుండి 3 గంటల 13 ని.లలో చేరుకోనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబైకి సాధారణ రైళ్లలో ప్రయాణానికి సుమారు 12 నుంచి 14 గంటల వరకు సమయం పడుతోంది. హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఈ ప్రయాణం సుమారు 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపార ప్రయాణికులు, ఐటీ రంగ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, పర్యాటకులకు ఇది భారీ ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ మార్గం తెలంగాణలో 93 కి.మీలు, కర్ణాటకలో 121 కి.మీలు, మిగిలిన 457 కి.మీలు మహారాష్ట్రలో కలిగిఉంటుంది.
తెలంగాణలో 93 కి.మీల భూసేకరణ

హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదిత మార్గం మ్యాప్.
కేంద్ర ప్రభుత్వం 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష ప్రారంభించింది. హైదరాబాద్‌ను ముంబై, చెన్నై, బెంగళూరుతో అనుసంధానించే ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే అధికారులు హైదరాబాద్–పుణె–ముంబై కారిడార్‌కు డీపీఆర్ పూర్తయిందని తెలిపారు.
ఈ కారిడార్ కోసం తెలంగాణ పరిధిలో దాదాపు 93 కిలోమీటర్ల మేర భూసేకరణ అవసరం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. అదనంగా హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 123 కిలోమీటర్ల మేర భూసేకరణ అవసరమవుతుందని తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలు ఈ ప్రాజెక్టులో కీలక కేంద్రాలుగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో రైల్ డిపోలు, నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే, విమాన–రైలు ప్రయాణాల అనుసంధానానికి ఇది పెద్ద ముందడుగవుతుందని భావిస్తున్నారు.
ప్రతిపాదిత మార్గంలో మొత్తం 12 స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్(కోకాపేట), జహీరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 16 కోచ్‌లతో నడిచే ఈ హైస్పీడ్ రైళ్లు ఒకసారి సుమారు 1,215 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర పరిధిలో సుమారు 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు, భూసేకరణ సమస్యలు, భౌగోళిక సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ అండర్‌గ్రౌండ్ మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా పట్టణ మౌలిక వసతులకు ఇబ్బంది తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ 2047లో కీలకపాత్ర

హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా హైదరాబాద్, పుణె, ముంబై మధ్య వేగవంతమైన రవాణాకు మార్గం సుగమం కానుంది.
సమీక్షా సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులను తెలంగాణ పురోగతికి కీలకంగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని “తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్”గా తీర్చిదిద్దడంలో ఈ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఏవియేషన్, రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో గంటల వ్యవధిలో కనెక్టివిటీ ఏర్పడితే పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు, పర్యాటకం, ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్–ముంబై కారిడార్ ద్వారా ఆర్థిక రాజధాని ముంబైతో తెలంగాణకు వేగవంతమైన అనుసంధానం లభిస్తుంది.
ప్రాజెక్టు అమలుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ ప్లానింగ్, ప్రాథమిక మౌలిక వసతులు, డిపోలకు అవసరమైన స్థలాలు, రహదార్ల అనుసంధానం వంటి అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ, హెచ్‌ఎండీఏ, జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు.. రైల్వే ప్రాజెక్టు అధికారులతో చర్చించి వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు దేశ రవాణా మౌలిక వసతుల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కేంద్ర రైల్వే శాఖ అధికారులు, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డీపీఆర్ సిద్ధం కావడం ఈ ప్రాజెక్టు అమలులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇకపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆమోదాలు, నిధుల సమీకరణ, భూసేకరణ, సాంకేతిక అనుమతులు పూర్తయిన తర్వాత నిర్మాణ దశకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణం మాత్రమే కాదు.. తెలంగాణ రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాల దిశే మారే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram