రూ.5,500కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా

పుప్పలగూడ-నార్సింగి ముష్కిన్ చెరువులో రూ.5,500 కోట్ల విలువైన 52.20 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. కోకాపేట, మాధాపూర్‌లోనూ భారీ ఆక్రమణలు తొలగించింది.

చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు, రోడ్ల ఆక్రమణలపై కొరడా జుళిపిస్తున్న హైడ్రా శనివారం మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా పుప్పలగూడ-నార్సింగ్ పరిధిలోని ముష్కిన్ చెరువులో 52.20 ఎకరాలను కబ్జా నుంచి కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలు తొలగించి రూ.5500 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించింది.

అంతకుముందు రోజు ఐటీ కారిడార్‌లోని మాధాపూర్‌లో చెరువును మాయం చేయాల‌నే క‌బ్జాదదారుల ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్ స‌ర్వే నంబ‌రు 7లో ఉన్న 6.05 ఎక‌రాల ఈదుల‌కుంటను క‌బ్జాల చెర నుంచి విడిపించింది.. 6.05 ఎక‌రాల ఈదుల‌కుంట‌కు తోడు.. ఆ ప‌క్క‌నే స‌ర్వే నంబ‌రు 11/37లో ఉన్న 5.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎక‌రాల భూమిని కాపాడిన‌ట్టు అయ్యింది. ఇలా మొత్తం మాధాపూర్‌లోనే దాదాపు రూ. 1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. ఈ భూమి చుట్టూ హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేసింది.

కాపేట కొత్త చెరువుకు హైడ్రాఫెన్సింగ్‌..

ఐటీ సెజ్‌ల‌కు చేరువ‌లోని కోకాపేట‌లో కొత్త చెరువు క‌బ్జాల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధి 72 ఎక‌రాలు. అభివృద్ధి మాటున చెరువు మ‌ధ్య‌లోంచి క‌ట్ట‌క‌ట్టి ఎగువున ఉన్న 20 ఎక‌రాల‌కు పైగా ఉన్న భూమిని కొంత‌మంది రియ‌ల్ట‌ర్లు క‌బ్జా చేశారు. ఫెన్సింగ్‌లు వేసి కొంద‌రు, రేకుల ప్ర‌హ‌రీల‌తో మ‌రి కొంద‌రు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డారు. వీరి క‌బ్జాల‌కు చెరువు మ‌ధ్య‌లో నిర్మించిన క‌ట్ట ఆస‌రాగా మారింది. మ‌రోవైపు గోల్డ్ ఫిష్ విల్లాల‌ను నిర్మించిన రియ‌ల్ట‌ర్ క‌బ్జాల‌కు పాల్పడ్డాడు. త‌న ప‌రిధి వ‌ర‌కూ విల్లాలు నిర్మించి ఓపెన్ ఏరియాగా చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిని వినియోగించేశాడు. చెరువులో మ‌ట్టి పోసి ఏకంగా బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టుల‌ను నిర్మించాడు. పిల్ల‌ల ప్లే ఏరియాను కూడా చెరువు ప‌రిధిలోనే ఏర్పాటు చేశాడు. ఇలా 1.09 ఎక‌రాల మేర చెరువును ఆక్ర‌మించేసి చేప‌ట్టిన నిర్మాణాల‌ను హైడ్రా తాజాగా తొల‌గించింది. చెరువు హ‌ద్దుల‌ను నిర్ధారించి.. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువు ఎగువ భాగంలో కూడా 20 ఎక‌రాల‌కు పైగా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హ‌ద్దులు నిర్ణ‌యించింది. భ‌విష్య‌త్తులో క‌బ్జాల‌కు అవ‌కాశం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇలా రూ. 2200 కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.

 

Latest News