‘I Love Muhammad’ Controversy | హైదరాబాద్ కు పాకిన ‘ఐ లవ్ మహ్మద్’

'ఐ లవ్ మహ్మద్' వివాదం హైదరాబాద్‌కు పాకింది. చంద్రాయణ్‌గుట్టలో బ్యానర్ ఏర్పాటు చేసిన ముస్లిం యువకులు వీడియోలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

‘I Love Muhammad’ Controversy | హైదరాబాద్ కు పాకిన ‘ఐ లవ్ మహ్మద్’

విధాత : ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో మొదలైన ‘ఐ లవ్ మహ్మద్’ వివాదం ఉత్తరాఖండ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు పాకి ఉద్రిక్తతలు రాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని చంద్రాయణ్‌గుట్టలో కొందరు ముస్లిం యువకులు ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి తీవ్ర అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ‘ఇది యూపీ కాదు, హైదరాబాద్..నీ ఆటలు ఇక్కడ సాగవు’అంటూ సవాల్ విసిరారు. హైదరాబాద్ చంద్రాయన్‌గుట్టలో ఈ రోజు ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్ ఏర్పాటు చేశాం.. దమ్ముంటే దీన్ని తీసి చూడండి.. అంటూ సవాల్ విసిరారు. మీరు ఈ బ్యానర్‌ని తొలగించాలంటే ముందు మమ్మల్ని దాటాల్సి ఉంటుందన్నారు. మమ్మల్ని ఏమైనా అనుకోండి.. జీహాదీ, ఆటంక్ వాది ఇలా ఏమైనా అనుకోండన్నారు. చివరగా సీఎం యోగిని ఘోరంగా అవమానించేలా “కాశాయ రంగు చీర ధరించి.. గాజులు వేసుకుని డ్యాన్స్ చేయాల్సి వస్తుంది.” అని తీవ్ర అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే ఇలాంటి యువకులను వెంటనే అరెస్ట్ చేసి..శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కాన్పూర్ లో రేగిన ముసలం

ఐ లవ్ మహ్మద్‌ వివాదం యూపీ కాన్పూర్ లో రాజుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరించి సద్దుమణిగింది. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సంద‌ర్భంగా కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో సెప్టెంబర్ 4న జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మద్‌’ అనే బ్యాన‌ర్‌ను ముస్లింలు ప్రద‌ర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంత‌రం వ్యక్తం చేశాయి. మ‌త‌ప‌ర‌మైన వేడుక‌ల్లో కొత్త సంప్రదాయం ఎందుకు ప్రవేశపెడుతున్నారని ప్రశ్నించాయి. పోలీసులు సమస్య ముదరముందే ఆ బ్యానర్ ను తొలగించారు. దీనిపై యూపీ సహా ఉన్నావ్, బరేలీ, కౌశాంబి, లక్నో, మహారాజ్‌గంజ్, కాశీపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో మైనార్టీలు సామూహిక ప్రద‌ర్శన‌లు, ర్యాలీలు చేపట్టారు. అయితే ఈ వ్యవహారం శాంతిభద్రతల సమస్య కాకుండా అన్నిచోట్ల పోలీసులు గట్టి బందోబస్తుతో కట్టడి చేయడంతో వివాదం చల్లబడింది. తాజాగా హైదరాబాద్ లో మళ్లీ ఐ లవ్ మహ్మద్‌ బ్యానర్ ప్రత్యక్షమైంది.