అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు

అసెంబ్లీలో కేటీఆర్-మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం. ఆరు గ్యారంటీలు, మహిళా రుణాలపై ఆరోపణలు, ప్రతిఆరోపణలతో సభ హాట్‌గా మారింది.

అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు

విధాత, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు, మంత్రులకు మధ్య పలు అంశాలపై తీవ్ర స్థాయి వాగ్యుద్దాలు కొనసాగాయి. కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పి సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయింది? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి కనిపెట్టేందుకు ఒక సిట్ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

సీఎం తొలి సంతకానికి జీరో వాల్యూ

జీరో వాల్యూ అయ్యింది ప్రజల ఆస్తుల విలువ కాదు అని, రేవంత్ చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ.. తొలి సంతకం చేసిన ఫైలుకు జీరో వాల్యూ అని , కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు జీరో వాల్యూ అని, కాంగ్రెస్ డిక్లరేషన్‌లకు జీరో వాల్యూ.. ప్రజల దృష్టిలో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పరిపాలన మొత్తం కూడా ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు అన్నట్లుగా ఉందన్నారు. హామీలు ఎగ్గొట్టు..ఉన్న పథకాలను చెడగొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు అన్నట్లుగా ఉందని ఆరోపించారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు. 420 హామీలు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోందని ఎద్దేవా చేశారు.

అభయ హస్తం కాదు..భస్మాసుర హస్తం

కాంగ్రెస్ ఇచ్చింది ‘అభయహస్తం’ అని చెప్పుకుంటున్నా, అమలులో అది ‘భస్మాసుర హస్తం’గా మారిందని కేటీఆర్  విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతి కుటుంబానికి రావాల్సిన రూ. 2.50 లక్షల లబ్ధి  ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదన్నారు.. ఇటీవల ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందని, ఒకవేళ ‘420 వరల్డ్ కప్’ పెడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గెలుస్తుందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 420 హామీల మేనిఫెస్టో రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని ఎద్దేవా చేశారు.

T-Hub అంటే చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏమో కాంగ్రెసోళ్లు! ప్రభుత్వ ఆఫీసులను టీహబ్‌కు మార్చాలని ఆదేశాలిచ్చారు అని, మళ్లీ గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకున్నారు అని ఎద్దేవా చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రికి తెలియకుండానే జీవోలు వస్తున్నాయా?సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని నిలదీశారు. విదేశీ పెట్టుబడులపై కాంగ్రెస్ గొప్పగా అబద్దాల లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు.

గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమాన యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’.. లూటిఫికేషన్లు ‘ఫుల్’ అని ఆరోపించారు. గ్యారంటీ కార్డులు కాస్తా ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయని  విమర్శించారు.

57వేల కోట్ల మహిళా రుణంపై కేటీఆర్ రాజీనామా సవాల్

గవర్నర్ ప్రసంగంలో మహిళలకు 57వేల జీరో వడ్డీ రుణాలు ఇచ్చామని అబద్దాలు చెప్పారని, అందాల పోటీలకు వచ్చిన బ్రిటన్ యువతిని వేధించి దేశం, రాష్ట్రం పరువు తీశారని ఆరోపించారు. 57వేల జీరో వడ్డీ రుణాలు ఇచ్చినట్లుగా చూపిస్తూ పదవికి రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ సవాల్ చేశారు. లేదంటే భట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగాలు కాంగ్రెస్ పాలనలో 7వేలు తగ్గినట్లుగా, ఐటీ ఎగుమతుల లెక్కలు గవర్నర్ ప్రసంగంలో తప్పుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు మేరకు జీవోలన్ని వెబ్ సైట్ లో పెట్టాలని చెప్పగా..17,774జీవోలు దాచి పెట్టారని బయట పడిందని..ఇది కాంగ్రెస్ ప్రజాపాలన డొల్లతనానికి నిదర్శనం అని, నిజంగా ఇది అణిచివేత ఇందిరమ్మ రాజ్యం అని విమర్శించారు. దేశంలో ఆయారాం, గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ అని, 2004లో మా 26మంది ఎమ్మెల్యేలలో 10మందిని ఎత్తుకెళ్లారని, ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో లూటిఫికేషన్ కు తెరలేపారని, హిల్ట్ పాలసీ పేరుతో 9వేల ఎకరాలు ప్రైవేట్ కు అప్పగించే కుట్ర చేశారని, మాపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, కూలేశ్వరం అని విమర్శించిన ప్రాజెక్టుతోనే హైదరాబాద్ కు నీళ్లు తెస్తామంటున్నారన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనులలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, నామినేషన్ పద్దతిని కేటాయింపులు చేయాలన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు.

మంత్రుల కౌంటర్

మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి అని, ఎంవోయూలు చేసిన వారందరూ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెడతారని చెప్పలేం అని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై నమ్మకంతో పెట్టుబడులకు ముందుకొస్తారు అని, గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన ఎంవోయూలపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తూ పెట్టుబడుదారులను ఆందోళనకు గురి చేస్తుందంటూ విమర్శించారు. జీరో వాల్యూ సీఎం రేవంత్ రెడ్డి సంతకానికి కాదని..పార్లమెంటు ఎన్నికల్లో జీరో సీట్లు ఇచ్చి ప్రజలు బీఆర్ఎస్ ను జీరో వాల్యూగా తేల్చారని చురకలేశారు.

డిప్యూటీ సీఎం భట్టి, సీతక్క మాట్లాడుతూ ఇప్పటిదాక 58వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, వాటి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అయినా కేటీఆర్ కు మహిళలంటే చిన్నచూపు ఉందని, అందుకే వారి ప్రభుత్వం చాల కాలం మహిళ మంత్రులను పెట్టలేదని, వారి ఇంట్లో ఆడపడుచూ పరిస్థితి ఏమిటో అందరూ చూస్తున్నారంటూ చురకలేశారు. బీఆర్ఎస్ వాళ్లు మహిళలకు సంబంధించిన 3వేల కోట్లు ఎగవేశారని విమర్శించారు.

 

మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మాదిరిగా డబుల్ బెడ్ రూమ్, దళితీ సీఎంల వంటి హామీలు ఎగవేయకుండా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు అందిస్తున్నామని గుర్తు చేశారు. అందుకు బీఆర్ఎస్ ధన్యవాదాలు చెప్పాలన్నారు. కేటీఆర్ నిరంకుశ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ నిరంకుశానికి, అహాంకారానికి, పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ అని ఎదురుదాడి చేశారు. స్పీకర్ తీర్పుపై కూడా బీఆర్ఎస్ మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు.

ఇవి కూడా చదవండి :

Zareena Khan | యాక్టింగ్ రాక‌నే బోల్డ్ సీన్స్ చేస్తుంద‌ని అన్నారు.. బాలీవుడ్ నటి జరీనా ఖాన్ ఆవేదన
Telangana Council | మండలిలో డ్రగ్ సెగలు.. మహేశ్, అద్దంకిల ఫైర్