విజయారెడ్డి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్టు.. భర్త సంచలన ఆరోపణలు
విజయశాంతి రెడ్డి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. భర్త సురేందర్ రెడ్డి ఆస్తి వివాదంపై సంచలన ఆరోపణలు చేశారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు నెలల క్రితం తల్లి విజయశాంతిరెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు రైలు కిందపడి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొత్త మలుపు చోటుచేసుకుంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి తన ప్రాణాలకు హాని ఉందని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. విజయా రెడ్డి తల్లి, సోదరులు.. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారని తన ఫిర్యాదులో పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆత్మహత్యగా నమోదైన ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే భర్త సురేందర్ రెడ్డినే విజయశాంతిని అనుమానించి వేధించేవాడని..అతని వేధింపుల వల్లే తను చనిపోయిందని ఆమె తల్లి, సోదరులు సైతం కౌంటర్ ఫిర్యాదు చేయడం గమనార్హం.
భార్య, పిల్లల ఆత్మహత్య వెనుక ఆస్తి కోసం కుట్ర
నా భార్య పిల్లల ఆత్మహత్య వెనుక అత్త, బామ్మర్ది ఆస్తి కోసం చేసిన కుట్ర దాగి ఉందన్న అనుమానాన్ని విజయశాంతి రెడ్డి భర్త తన ఫిర్యాదులో వ్యక్తం చేశారు. సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన భార్య విజయశాంతి రెడ్డి, కుమార్తె చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మరణాలకు తన బావమరిది వడకళ్ల చిరంజీవి, అత్త పుష్పావతి, చిరంజీవి భార్య లక్ష్మీ కారణమని ఆరోపించారు. వాళ్లు ఒత్తిడి చేయటం వల్లే విజయా రెడ్డి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని, వారి ముగ్గురి మరణానికి వీరే కారణమని, ఇప్పుడు తన ఆస్తిని చేజిక్కించుకునేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. ‘నా భార్య ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదని, ఈ ఘటనకు 3గంటల ముందు ఏం జరిగింది. బెడ్‌రూమ్‌లో కాలిన పేపర్స్ కనిపించాయి అని, ఆస్తి కోసం వాళ్లు ఎంతకు అయినా తెగిస్తారు. నేను చనిపోతే ఆస్తి ఏం చేస్తావని అడిగారు అని.. నేను చనిపోతే ఆస్తి మొత్తం వాళ్లకు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు ఉన్నారు. నేను చనిపోతే నా ఆస్తులు నా తల్లిదండ్రులకు లేదా ట్రస్టుకు రాస్తాను. వారితో నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి’ అంటూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భార్య, పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే.. 25రోజులకే ఆస్తి కోసం నన్ను బెదిరించారని ఆరోపించారు.
మిస్టరీగా తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి ఆత్మహత్య ఓ మిస్టరీగా మిగిలిపోయింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసం ఉంటున్న పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38), ఆమె కూతురు చైతన్య రెడ్డి (18), కొడుకు విశాల్ రెడ్డి (17) జనవరి 31న ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి తమ కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ముగ్గురు.. అనంతరం సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. విజయ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేశారు. విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారని సమాచారం. విజయశాంతి రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయల వరకు వేతనం పొందేవారు. కుమార్తె చైతన్య రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విజయశాంతిరెడ్డి, ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఇప్పటికి వెల్లడికాలేదు. విజయారెడ్డి చనిపోయాక ఆస్తి వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్య, పిల్లల ఆత్మహత్య ఘటనపై భర్త సురేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
డీలిమిటేషన్ పై.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram