ఆరు నూరైనా ఆయన ఈ రోజు కోర్టులో హాజరుకావాల్సిందే: హైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కేసులో ఆర్థిక కార్యదర్శి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు జడ్జీ రాజేశ్వరరావు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ పై హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నూరైనా సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందేనని.. కావాలంటే అర్థరాత్రి దాకా తాను కోర్టు హాల్ లో వేచిచూస్తానని హైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు స్పష్టం చేశారు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు.. వారి పదవీ విరమణ బకాయిలను దాదాపు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదని గత ఏడాది కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి రాజేశ్వర రావు ఆ బకాయిలను సత్వరం చెల్లించాల్సిందిగా గత సంవత్సరం ఆదేశాలు ఇచ్చారు. అయితే, సంవత్సరం పైచిలుకు గడిచినా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయకపోవడంతో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై చర్యలు కోరుతూ ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు.

అనేక గడువుల అనంతరం.. గత గడువు సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శినీ వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ “ఫాం వన్” జారీ చేస్తూ దాదాపు 644 కోర్టు ధిక్కార కేసులను సోమవారానికి వాయిదా వేశారు. అయితే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ మాత్రం సోమవారం కూడా కోర్టుకి హాజరు కాలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు… పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, ఏజీలు ఆర్థిక శాఖ తరపున కోర్టుకి హాజరు అయ్యారు. కోర్టు ఆదేశాల అమలు కోసం గతంలో చాలా సార్లు విజయవంతంగా కోర్టు ద్వారా గడువులు పొందిన ప్రభుత్వ న్యాయవాది ఈరోజు కూడా ఆర్థిక కార్యదర్శి కోసం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ అభ్యర్థించడంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“బకాయిలు చెల్లించాల్సిందిగా కోర్టు గత ఏడాది ఆదేశాలు ఇచ్చింది. వాటిని ఇప్పటివరకూ పూర్తిగా ప్రభుత్వం అమలు పరచలేదు. కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై నోటీసులు జారీ చేసికూడా ఆరు నెలలు దాటింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించిన వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సిందిగా గత గడువు సందర్బంగా ఈ కోర్టు ఆదేశించింది. అయినా కూడా తను హాజరు కాకపోవడం పట్ల ఉపేక్షించేది లేదు,” అని న్యాయమూర్తి రాజేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో బిజీగా ఉన్నారనీ, కోర్టుకి రాలేక పోయారనీ, అందుకే ఈదఫా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఈరోజు ఉదయం కోర్టుకివిన్నపం సమర్పించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలు ఉన్న సంగతి వాళ్లకి ముందే తెలిసినందునా అలాంటి విన్నపం ఏదైనా ఉంటే ముందే సమర్పించి ఉంటే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేదనీ, అలా చేయకపోవడాన్ని ఈరోజు మాత్రం ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. “ఈరోజు ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. కావాలంటే ఈరోజు అర్థరాత్రి వరకైనా నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తాను అని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు” అని న్యాయమూర్తి రాజేశ్వర రావు విస్పష్టంగా పేర్కొన్నారంటూ.. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల తరపు న్యాయవాది సీఆర్ సుకుమార్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

అసెంబ్లీలో బస్వాపురం నిర్వాసితుల సమస్యలపై కుంభం గళం
Rythu Bharosa| రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Latest News