ట్రంప్ శాసనంతో భారత్‌కు దెబ్బ..50 శాతం టారిఫ్ విధింపు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దిగుమతులపై 50% టారిఫ్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా చమురు కొనుగోలుపై అభ్యంతరంతో తీసుకున్న ఈ చర్యను భారత్ "అన్యాయం, అనవసరం, అనుచితం"గా ఖండించింది. టెక్స్టైల్, ఆటో భాగాలు, కెమికల్స్ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఇండియా-అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తుపై మేఘాలు కమ్ముకున్నట్లైంది.
- ట్రంప్ శాసనంతో భారత్‌కు దెబ్బ
- ఇది అన్యాయం, అనుచితం
- చైనా కంటే భారత్‌కు ఎక్కువ శిక్ష
- అమెరికా రాజకీయాలకే తలవంచాలా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దిగుమతులపై 50శాతం టారిఫ్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా చమురు కొనుగోలుపై అభ్యంతరంతో తీసుకున్న ఈ చర్యను భారత్ “అన్యాయం, అనవసరం, అనుచితంగా ఖండించింది. టెక్స్టైల్, ఆటో భాగాలు, కెమికల్స్ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఇండియా-అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తుపై మేఘాలు కమ్ముకున్నట్లైంది.
విధాత: భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం దిగుమతి పన్నులు (టారిఫ్‌లు) విధించారు. ఇప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్‌పై అదనంగా మరో 25 శాతం పెంచుతూ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు అమలులోకి రానున్న 21 రోజుల తర్వాత, భారత్ నుంచి దిగుమతి అయ్యే పలు ముఖ్య ఉత్పత్తులపై మొత్తం 50 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఈ చర్యకు కారణంగా ట్రంప్ భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న విషయాన్ని ప్రస్తావించారు. “రష్యా యుద్ధాన్ని ఆర్థికంగా బలపరచే చర్యల్లో భారత్ భాగమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న సమయం కూడా హఠాత్తుగా ఉండడం గమనార్హం — మొదటి 25 శాతం టారిఫ్‌లు అమలులోకి రావడానికి కేవలం 14 గంటల ముందు ఆయన సంతకం చేశారు.

ఇది అన్యాయం, అనుచితం
ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, “ఇది అన్యాయమైనది, అనవసరమైనది, అనుచితమైనది” అని పేర్కొంది. “రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అంటే — ప్రపంచంలోని అనేక దేశాలు చేస్తూనే ఉన్న వ్యవహారమే. అమెరికా తానే కూడా యురేనియం, పల్లాడియం, ఫెర్టిలైజర్లు వంటి వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాంటప్పుడు కేవలం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా పక్షపాతం, ద్వంద్వ ధోరణి గలదీ” అని పేర్కొంది. భారత ఎగుమతులు ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్, ఆటో భాగాలు, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, కట్ & పాలిష్డ్ డైమండ్స్ వంటి రంగాలపై ఈ అధిక టారిఫ్‌లు భారీ ప్రభావం చూపనున్నట్లు అంచనా.
చైనాపై కన్నా భారత్‌కు ఎక్కువ శిక్ష
భారత దిగుమతులపై ఇప్పుడు విధించబోతున్న మొత్తం 50 శాతం టారిఫ్ చైనా మీద ఉన్న 30 శాతం టారిఫ్ కంటే 20 శాతం ఎక్కువ. పాకిస్తాన్‌పై ఉన్న 19 శాతం టారిఫ్‌తో పోలిస్తే ఇది ఒకింత తీవ్రమైన ఆర్థిక ముప్పుగా మారనుంది. ట్రంప్ తన నిర్ణయానికి తోడుగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “ఇండియా, రష్యా కలిసి తమ మృత ఆర్థిక వ్యవస్థలను ఇంకా నాశనం చేసుకోవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అంతేకాదు, భారత్ రష్యాతో చమురు వాణిజ్యాన్ని కొనసాగిస్తే, మరిన్ని చర్యలు తీసుకుంటానన్న ఆయన వ్యాఖ్యలు భారత్‌పై కొనసాగుతున్న ఒత్తిడికి సంకేతంగా నిలిచాయి.
అమెరికా రాజకీయాలకే తలవంచాలా?
భారత ప్రభుత్వం ఇప్పటికీ జాతీయ ప్రాధాన్యతలే మాకు ముఖ్యం అనే వైఖరినే పాటిస్తోంది. “140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కోసం తీసుకుంటున్న వ్యాపార నిర్ణయాలను కేవలం తమ కోణం నుంచి తప్పుగా ప్రకటించడం సమంజసం కాదు” అని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఇతర దేశాలు కూడా రష్యా నుంచి పెద్దఎత్తున వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంలో స్వార్థప్రేరిత విధానం కనిపిస్తోందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ సంబంధాలు మరింత సంక్లిష్టతను ఎదుర్కొననున్నాయి. రష్యా చమురు అంశాన్ని ఆసరాగా తీసుకుని ట్రంప్ తీసుకున్న ఈ చర్యలు వాణిజ్య, వ్యూహాత్మక సహకారంపై బలమైన ప్రభావం చూపే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram