ట్రంప్–పుతిన్ చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు

ట్రంప్–పుతిన్ చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని ద్వితీయ టారిఫ్‌లు పెంచుతామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్​ బెసెంట్​ హెచ్చరించారు.

ట్రంప్–పుతిన్ చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు
  • అలాస్కా చర్చల ముందు అమెరికా కఠిన హెచ్చరిక
  • భారత్‌ వాణిజ్య ప్రయోజనాలపై కఠిన వైఖరి
  • భారత్​ మొండిదని అవమానకర వ్యాఖ్య

 Trump–Putin Talks | రుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, అమెరికా మరోసారి భారత్‌పై టారిఫ్‌ బెదిరింపులు చేసింది. అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమావేశానికి ముందు, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ భారత్‌పై ద్వితీయ టారిఫ్‌లు పెంచవచ్చని బహిరంగ హెచ్చరిక చేశారు. “రష్యా చమురు కొనుగోలు చేసినందుకు ఇప్పటికే భారతీయులపై ద్వితీయ టారిఫ్‌లు విధించాం. చర్చలు సరిగా సాగకపోయినా, విఫలమైనా ఆంక్షలు, టారిఫ్‌లు మరింత పెరగవచ్చు,” అని బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలే ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌పై 50% టారిఫ్‌లు విధించింది. అందులో 25% రష్యా ఆయుధాలు, చమురు కొనుగోలుపై జరిమానాగా చేర్చారు. దీన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. “భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం. ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థ చేసినట్టే, భారత్‌ కూడా తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది,” అని స్పష్టంగా పేర్కొంది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులను 3% నుండి 35-40% వరకు పెంచింది. లక్షలాది పేద భారతీయులపై పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు చౌకైన చమురే సరైన మార్గమని ఢిల్లీ వాదిస్తోంది. అయితే ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి, ట్రంప్‌ భారత్‌ను “టారిఫ్‌ దుర్వినియోగదారు”గా ముద్ర వేస్తూ, వాణిజ్య లోటును తగ్గించడమే తన లక్ష్యమని చెబుతున్నారు.

అమెరికా నుంచి ఇలాంటి బెదిరింపులు మొదటిసారి కావు. ఇటీవలే బెసెంట్‌ భారత్‌ను “కొంచెం మొండిగా” ఉందని అవమానకరంగా వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొంతమంది భారత్‌ను మొండిదని అంటున్నారని విన్నాను. కానీ అన్యాయానికి తలవంచే విధేయత కంటే మొండితనం మేలని” అని ఆయన ట్వీట్‌ చేశారు.

ట్రంప్‌ ఈ కొత్త 50% టారిఫ్‌లను ఆగస్ట్‌ 27 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికాకు ఉన్న వాణిజ్య భాగస్వాములలో ఆసియా నుండి అత్యధిక పన్ను భరిస్తున్న దేశంగా భారత్‌ నిలవనుంది. ఈ పన్ను భారం నూలు, ఆభరణాలు వంటి ఎగుమతి రంగాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంతేకాదు, భారత ఆర్థిక వృద్ధి అర్ధశాతానికి పడిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై ఇలాంటి బెదిరింపులు, జరిమానాలు కేవలం అమెరికా ఒత్తిడి రాజకీయాలే అని ఢిల్లీ స్పష్టంగా అర్థం చేసుకోవాలని,  జాతీయ గౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం భారత్‌ మరింత కఠినంగా నిలబడి, ఏకపక్ష ఆర్థిక దాడులకు తలవంచరాదని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.