జులై 5న జపాన్​కు పెను విపత్తు..వణికిస్తోన్న న్యూ బాబా వంగ జోస్యం

ఒక చెడు భవిష్యవాణి(ominous prediction) ఇప్పుడు జపాన్(Japan)​ దేశాన్ని వణికిస్తోంది. ఆ దేశానికి ప్రయాణం కట్టిన అనేకమంది ఇప్పుడు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. జులై 5(July5, 2025) న జపాన్​కు పెద్ద విపత్తు(catastrophe) వాటిల్లబోతోందని సోషల్​మీడియాలో వెల్లువెత్తుతున్న పుకార్లు జపాన్​లోను, చుట్టుపక్కల దేశాలను కలవరపెడుతున్నాయి.

జులై 5న జపాన్​కు పెను విపత్తు..వణికిస్తోన్న న్యూ బాబా వంగ జోస్యం

జపాన్​కు చెందిన ప్రముఖ మంగా కళాకారిణి(Manga Artist), ‘నవ బాబా వంగా’(New Vanga Baba)గా ప్రసిద్ధి చెందిన రియో టట్సూకీ(Ryo Tatsuki) చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు జపాన్​ను, ఆ సమీప దేశాలను ముచ్చెమటలు పట్టిస్తోంది. హాంగ్​కాంగ్(Hongkong)​ నుండి జపాన్​కు ప్రయాణం కట్టిన వేలాదిమంది జూన్​ అఖరివారం, జులై మొదటివారం మధ్యలో ఉన్న తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు(Cancelling tours to japan). ఈ వార్త వల్ల ఏకంగా 83 శాతం విమాన బుకింగ్​లు పడిపోయాయని అక్కడి ట్రావెల్​ ఏజెన్సీలు లబోదిబోమంటున్నారు.

రియో టట్సూకీ 1999లో గీసిన చిత్రకథ “ద ఫ్యూచర్​ ఐ సా”(The Future I Saw) లో ఓ పెను ఉపద్రవం గురించి ఊహించింది. ఇంతకుముందు కొవిడ్​–19 గురించి కూడా ఈమె భవిష్యవాణి వినిపించింది. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ ఆమె చెప్పిందేమిటంటే, జులై5, 2025న జపాన్​ను ప్రళయం ముంచెత్తబోతోంది..అని. 2022లో పునర్​ముద్రించబడిన “ద ఫ్యూచర్​ ఐ సా : కంప్లీట్​ ఎడిషన్”​ లో జులై 5, 2025న జపాన్​కు భారీ ఉపద్రవం సంభవించనుంది అని ఒక లైన్​ ఆ పుస్తకంలో రాసింది. భారీ భూకంపం(Heavy Earthquake) కారణంగా పెను సునామీ(Mega Tsunami) జపాన్​పై విరుచుకుపడుతుందని ఆమె తన భవిష్యవాణిలో చెప్పింది. ఇంతకుముందు, కొవిడ్​19 గురించి, 2011లో తొహొకు(Tohoku), జపాన్​లో సంభవించిన భారీ భూకంపం, సునామీ గురించి కూడా టట్సూకీ అంచనా వేసింది. మరో 17 రోజులలో జరుగబోతున్నట్లుగా చెప్పబడుతున్న విపత్తు గురించి ఆమె వివరించినదాని ప్రకారం.. జపాన్​, ఫిలిప్పీన్స్​ మధ్యన, సముద్రం అడుగుభాగంలో ఓ భారీ చీలిక ఏర్పడి, పెను భూకంపానికి, సునామీకి దారీ తీస్తుందనీ, దాని అలలు 2011 సునామీ అలల(130 అడుగుల ఎత్తు) కంటే మూడు రెట్లు పెద్దవిగా వస్తాయని ఆమె అంచనా వేసింది.

ఈ విషయం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి, పర్యాటకులు ఆ తేదీకి చుట్టుపక్కల వారాలలో ఉన్న ప్రయాణాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. హాంగ్​కాంగ్​ ఎయిర్​లైన్స్​(Hongkong Airlines) ఏకంగా దక్షిణ జపాన్​ నగరాలైన కగోషిమా, కుమామొటోలకు విమానాలను ఈ కారణం వల్ల రద్దు చేసింది. ఏప్రిల్​, మే నెలల్లో వసంత రుతువు సందర్భంగా జపాన్​లోని పలు పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ కాలంలో చెర్రీ బ్లాసం(Cherry blossom) చెట్లు విరగబూసి, చాలా అందంగా కనబడతాయి. వాటిని చూడటానికి ఏప్రిల్​ నుండి జులై మధ్యలో పర్యాటకులు జపాన్​కు పోటెత్తుతారు. సాధారణంగా  హాంకాంగ్​లో అప్పుడే ఈస్టర్​ సెలవులు ఉంటాయి కాబట్టి, ఆ దేశంనుండి పెద్దయెత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ భవిష్యవాణి పుణ్యమాని జపాన్​ పర్యాటకం ఈ ఏడు 50శాతానికి పైగా తగ్గిపోయిందని ట్రావెల్​ ఏజెన్సీలు చెబుతున్నాయి.

ఈ గందరగోళాన్ని నివారించేందుకు జపాన్​ ప్రభుత్వం నడుంబిగించింది. గత ఏప్రిల్​ 23న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మియాగీ(Miyagi) గవర్నర్​ యోషిహిరో మురాయ్​ చిందులు వేస్తూ, సోషల్​ మీడియాలో  ప్రచారమవుతున్న శాస్త్రీయ ఆధారం లేని ఊహాజనిత వ్యాఖ్యలు అర్ధరహితం. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల జపాన్​ పర్యాటకం దెబ్బతింటుందని గ్రహించాల్సిందిగా మురాయ్​ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ విషయం జపాన్​ ప్రజలకు కూడా తెలుసు కానీ, వారెక్కడికీ పారిపోవడంలేదు. కనుక మీరు నిశ్చింతగా జపాన్​లో పర్యటించండంటూ పర్యాటకులకు హామీ ఇచ్చారు. జపాన్​ జాతీయ పర్యాటక సంస్థ(Japan National Tourism Organisation) కూడా భూకంపం, సునామీ వస్తుందన్న అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని తెలిపింది.

జపాన్​ వాతావరణ శాఖ(Japan Meteorological Agency) కూడా సాధారణంగా తేదీ, ప్రాంతం సహా చెప్పబడే అంచనాలు బూటకం(Hoax)గానే పరిగణిస్తామని తమ వెబ్​సైట్​లో పేర్కొంది. హాంకాంగ్​ ఎయిర్​లైన్స్​, జపాన్​కు తమ ప్రయాణాలకు రద్దు చేసుకుంటున్న పర్యాటకులకు వేరే ప్రదేశాలలో పర్యటించే వెసులుబాటు కల్పించింది. చేసుకున్న బుకింగ్​లను వేరే దేశాలైన చైనా, తైపీ, బ్యాంకాక్​, వియత్నాంలకు మళ్లించే అవకాశం ఏర్పాటుచేసింది. ఈ రకంగా తమ వ్యాపారం దెబ్బతినకుండా చూసుకుంటున్నామని ఎయిర్​లైన్స్​ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.