Viral News | సాధారణంగా చైనీయులంటే నల్లటి జట్టు, నలుపు కళ్లే గుర్తుకొస్తాయి.. కానీ చైనాలోని ఓ దంపతులకు మాత్రం నీలి కళ్లు, బంగారు వర్ణపు కర్లీ హెయిర్‌తో పాప జన్మించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో అనుమానం వచ్చి పాపకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని యాన్‌చెంగ్ నగరానికి చెందిన యాంగ్ దంపతులకు 2022 మేలో ఓ చిన్నారి జన్మించింది. ఆ చిన్నారికి గుఓజియాంగ్ అనే నిక్ నేమ్ కూడా పెట్టుకున్నారు. చిన్నప్పుడు చూడటానికి ముద్దుగా చైనీస్ పిల్లలాగే కనిపించడంతో ఎంతో మురిసిపోయారు. కానీ పెరిగిన కొద్దీ పాప రూపంలో చాలా మార్పులు వచ్చాయి. ఎనిమిది నెలల వయసులో చిన్నారి కళ్లు నీలం రంగులోకి మారాయి. ఏడాది వయసు వచ్చేసరికి ఆమె జుట్టు బంగారు వర్ణంలోకి మారింది. జుట్టు కర్లీగా తయారైంది. కంటి రెప్పలు పొడవుగా పెరిగాయి. తమ కూతురి రూపంలో వచ్చిన మార్పు చూసి యాంగ్ తల్లిదండ్రులు ఎంతగానే షాకయ్యారు.
చైనీస్‌లా కాకుండా రష్యన్స్‌ను పోలినట్లుగా పాప రూపం ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో అసలు ఆ పాప తమ కూతురేనా కాదా అనే అనుమానం ఆ తల్లిదండ్రుల్లో మొదలైంది. ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన సమయంలో పొరపాటున వేరే బిడ్డను ఇచ్చారేమో అని సందేహించారు. నిజాన్ని తెలుసుకోవాలని డీఎన్‌ఏ టెస్ట్ కూడా చేయించారు. అప్పుడు ఆ పాప తమ బిడ్డనే అని స్పష్టమైంది.
తను, తన భార్య ఇద్దరూ చైనీస్ అయినప్పుడు తమ కూతురు రష్యన్‌లా ఎందుకు పుట్టిందని యాంగ్‌కు అనుమానం వచ్చింది. దీనికి ఎలాగైనా సమాధానం తెలుసుకోవాలని తన వంశ వృక్షాన్ని పరిశీలించాడు. తన తాత ముత్తాతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే యాంగ్‌కు షాకింగ్ విషయం తెలిసింది. యాంగ్ ముత్తాత ఒక రష్యన్ అని బయటపడింది. రష్యా నుంచి వచ్చిన ఆయన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారని తెలిసిందని యాంగ్ స్థానిక మీడియాతో తెలిపాడు. అయితే వాళ్ల ముత్తాత 1985లో మరణించినట్లు కుటుంబ రికార్డుల్లో ఉందని పేర్కొన్నాడు.
తమ కుటుంబంలో ఇంతవరకు ఎక్కువగా అబ్బాయిలే పుట్టారని.. కానీ తమ ముత్తాత జన్యు లక్షణాలు ఎవరిలోనూ బయటపడలేదని యాంగ్ తెలిపాడు. తన కూతురిలోనే తొలిసారిగా ఆ లక్షణాలు బయటపడ్డాయని చెప్పాడు. ఇప్పుడు తన పాపతో బయటకు వెళ్లినప్పుడు.. చూసిన ప్రతిఒక్కరూ చిన్నారి విదేశీయురాలా అని అడుగుతున్నారని.. వాళ్లందరికీ వివరణ ఇవ్వడం విసుగ్గా మారిందని చెప్పుకొచ్చాడు. కాగా, తమ కూతురు రూపం గురించి తాను పెద్దగా ఆలోచించనని.. తాను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే చాలు అని యాంగ్ దంపతులు స్పష్టం చేశారు. ఈ పాప కథ గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. కాగా.. తాజాగా చిన్నారి కథ మరోసారి వైరల్‌గా మారింది.
Read More:
Viral News | ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్.. లక్షల్లో జీతం.. అయినా జాబ్ మానేసిన పాతికేళ్ల కుర్రాడు
