టారిఫ్‌లతో భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రమాదం : డెమోక్రటిక్‌ లా మేకర్‌ గ్రగరీ మీక్స్‌

భారత్‌పై టారిఫ్‌ల విధింపు విషయంలో అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశంపై విధించిన టారిఫ్‌లు రెండు దేశాల కీలక సంబంధాలను దెబ్బతీస్తాయని అమెరికాకు చెందిన కీలక చట్టసభ సభ్యుడు రెప్‌ గ్రెగరీ మీక్స్‌ అన్నారు

టారిఫ్‌లతో భారత్‌–అమెరికా సంబంధాలకు ప్రమాదం : డెమోక్రటిక్‌ లా మేకర్‌ గ్రగరీ మీక్స్‌

విధాత: భారత్‌పై టారిఫ్‌ల విధింపు విషయంలో అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారతదేశంపై విధించిన టారిఫ్‌లు రెండు దేశాల కీలక సంబంధాలను దెబ్బతీస్తాయని అమెరికాకు చెందిన కీలక చట్టసభ సభ్యుడు రెప్‌ గ్రెగరీ మీక్స్‌ అన్నారు. ఆయన అమెరికా ప్రతినిధుల సభ విదేశాంగ వ్యవహారల కమిటీలోని కీలక సభ్యుడు. డెమోక్రటిక్‌ పార్టీ నేత. బుధవారం అమెరికాలోని భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంపై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అమెరికా–భారత్‌ భాగస్వామ్యానికి కాంగ్రెస్‌ మద్దతు విషయాన్ని నొక్కి చెప్పేందుకు వినయ్‌ మోహన్‌ క్వాత్రాను కలుసుకున్నాను. ఈ భాగస్వామ్యం క్వాడ్‌ ద్వారా కూడా గత పాతికేళ్లుగా కొనసాగుతున్నది’ అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య మరింత పటిష్టమైన సంబంధాలకు, ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలన్న రెండు దేశాల ఆకాంక్షలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాను. ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు ఈ కీలక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించాను’ అని మీక్స్‌ తెలిపారు.

మీక్స్‌ పోస్ట్‌పై క్వాత్రా స్పందిస్తూ.. అమెరికా– భారత్‌ సంబంధాల పట్ల మీక్స్‌ నిరంతర మార్గనిర్దేశం, అచంచలమైన మద్దతుకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, భారత్‌–పసిఫిక్‌, దానితోపాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విస్తృతస్థాయిలో అంశాలపై చర్చించుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెషనల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ కాకసస్‌ చైర్‌గా వ్యవహరిస్తున్న ప్రతినిధి కరోల్‌ మిల్లర్‌తోనూ క్వాత్రా సమావేశమయ్యారు. భారతదేశపు ఎనర్జీ సెక్యూరిటీ వాణిజ్యం అంశాలపై ఆమెకు క్వాత్రా వివరించారు. అమెరికా అధ్యక్షుడు టారిఫ్‌లు విధించిన తర్వాత భారత్‌–అమెరికా సంబంధాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన దగ్గర నుంచీ క్రాత్రా దాదాపు ప్రతిరోజూ అమెరికా చట్ట సభ ప్రతినిధులను కలుస్తున్నారు.