అమెరికాలో మార‌తున్న నీటి రుచి.. రోడ్డుపై ఆ ర‌సాయ‌నాన్ని జ‌ల్ల‌డ‌మే కార‌ణం !

అమెరికాలో మార‌తున్న నీటి రుచి.. రోడ్డుపై ఆ ర‌సాయ‌నాన్ని జ‌ల్ల‌డ‌మే కార‌ణం !

విధాత‌: అమెరికా (Groundwater) లో తాగునీటికి సంబంధించి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే (యూఎస్‌జీఎస్‌) చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం.. భూగ‌ర్భ జ‌లాల్లో ల‌వ‌ణీయ‌త (Ground Water Salinity) పెరిగిపోతోంద‌ని వెల్ల‌డైంది. 82 నిర్దేశిత ప్రాంతాల్లో ఉన్న బావులు, భూ గ‌ర్భ జ‌లాల న‌మూనాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం శాస్త్రవేత్త‌లు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. అమెరికా జ‌లాల్లో సోడియం, క్లోరైడ్ శాతం పెరిగిపోతోందని దీని కార‌ణంగానే ల‌వ‌ణీయ‌త హ‌ద్దులు దాటుతోంద‌ని తెలిపారు. సైన్స్ అలెర్ట్ జ‌ర్న‌ల్‌లో ఈ ప‌రిశోధ‌న వివ‌రాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి.


సుదీర్ఘ ప్ర‌యోగాలు


ఈ అధ్య‌య‌నం కోసం శాస్త్రవేత్త‌లు సుమారు 300 వేల బావుల్లోని నీటిని సేక‌రించారు. వీటి లోతు, నేల స్వ‌భావం, అవ ఉన్న ప్రాంతం, ప‌రిస‌రాల్లో వేస్తున్న పంట‌లు త‌దిత‌రాల‌ను ప‌రిగ‌ణన‌లోకి తీసుకుని ఆ న‌మూనాల‌ను విశ‌దీక‌రించారు. అనంత‌రం ప‌రిశీలించి చూడ‌గా ఆ న‌మూనాల్లో ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ర‌సాయ‌నాలు, పురుగు మందుల అవ‌శేషాలు, రేడియో న్యూక్లైడ్స్ త‌దిత‌రాల‌ను గుర్తించారు. అంతే కాకుండా నీటిలో ఉప్ప‌ద‌నం పెరిగిపోతోంద‌ని.. తీయద‌నం లోపిస్తోంద‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు.


చిన్న చిన్న తంతువులుగా విడిపోయిన ఘ‌న ప‌దార్థాలు కూడా నీటిలో క‌లిసిపోయి నీటి రుచిని మార్చేస్తున్న‌ట్లు గ‌మ‌నించారు.నీటిలో ల‌వ‌ణీయత పెర‌గ‌డం వల్ల ప్ర‌ధానంగా మూడు స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ఈ అధ్య‌య‌నం గుర్తించింది. వాటిలో మొద‌టిది భ‌వ‌నాల‌పై ప‌డే ప్ర‌భావం. ఉప్పు నీటి వ‌ల్ల భారీ భ‌వ‌నాల్లో ఉండే పైపులు, ఇత‌ర లోహ సామ‌గ్రి తుప్పు ప‌ట్టిపోతాయి.


త‌ర్వాత‌ది ప‌ర్యావ‌ర‌ణంపై దుష్ప్ర‌భావం. పెరుగుతున్న క్లోరిన్ శాతం … జ‌ల‌చ‌రాల జీవితాల‌ను దుర్భ‌రం చేస్తుంది. ముఖ్యంగా వాటి పున‌రుత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. దీంతో జీవ‌వైవిధ్యం దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంటుంది. మూడోది, అన్నింట్లోనూ ముఖ్య‌మైంది మ‌నిషి ఆరోగ్యంపై ప‌డే ప్ర‌భావం. పెరుగుతున్న ల‌వ‌ణీయ‌త మ‌నిషిలో రేడియం స్థాయిల‌ను పెంచుతుంది. ఇది ఆరోగ్యంపై పెను ప్ర‌భావం చూపెడుతుంది.


రోడ్లే కార‌ణ‌మా..


భూగ‌ర్భ జ‌లాలు ఉప్ప‌గా మార‌డం శీత‌ల ప్రాంతాల్లోనే ఎక్కువ‌గా ఉంద‌నే విష‌యాన్ని జియాల‌జిస్టులు గుర్తించారు. దీనికి కార‌ణం ఏమిటంటే.. శీత‌ల ప్రాంతాల్లో ఎక్కువ‌గా మంచు కురుస్తుంద‌న్న విష‌యం తెల‌సిందే. ఇది రోడ్ల‌పై పేరుకుపోయి ర‌వాణాకు అంత‌రాయం క‌లిగిస్తుంది. దీనిని తొల‌గించాల‌నే ఒత్తిడితో అధికారులు ఎడాపెడా సోడియం క్లోరైడ్‌ను మంచుపేరుకుపోయిన రోడ్ల‌పై జ‌ల్లుతున్నారు.


ఈ సోడియం క్లోరైడ్‌కు మంచును క‌రిగించే ల‌క్ష‌ణం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే అమెరికాలో దీనిని విరివిగా ఉప‌యోగిస్తారు. ఇక్క‌డే స‌మ‌స్య మొద‌లవుతోంది. ఇలా రోడ్ల‌పై జ‌ల్లిన సోడియం క్లోరైడ్ అంతా.. భూమిలోకి ఇంకిపోయి భూగ‌ర్భ‌జ‌లాల‌ను క‌లుషితం చేస్తోంది. పురుగుమందులు, ర‌సాయ‌నాల‌కు తోడు ఈ స‌మ‌స్య కూడా ఎక్కువైతే.. ఇక తీయ‌ని నీరు దొర‌క‌డం అరుదైన విష‌య‌మైపోతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.