srael vs Iran | ఇజ్రాయెల్–ఇరాన్ : ఎవరి బలమెంత?
పశ్చిమాసియాలో ఇరాన్ కయ్యానికి కాలు దువ్విన వేళ, ఇజ్రాయెల్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది.
Israel vs Iran : ప్రతీకారం తప్పదు అన్న నెతన్యాహు ప్రకటన సత్యదూరం కాబోదు. అయితే ఎప్పుడు? ఎలా అన్నదే చూడాలి. ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ సైనిక బలం, బలగాలను మోహరిస్తే ఎవరి స్థాయి ఏంటి అనేది చూద్దాం. ఇరాన్ చిన్న దేశమేమీ కాదు. ఇజ్రాయెల్‌తో పోలిస్తే చాలా పెద్దది. అయితే దాని మిలిటరీ సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ కంటే ఎక్కువనా అనేది ఎవరికీ అంతగా తెలియదు. పైగా నిన్నటి దాడిలో ప్రయోగించిన 180 క్షిపణులు వృధా అయితే కాలేదు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచమంతా పేరెన్నిక గన్నది. మరి నిన్నటి దాడుల్లో అది ఏ మేరకు విజయవంతమైంది? ఎన్ని ఇరాన్ క్షిపణులను కూల్చేసిందనేది కూడా ప్రశ్నే. ఈ యుద్ధానికి మూల కారణమైన హమాస్ దాడిని కూడా అప్పట్లో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రతిఘటించలేకపోయింది. ఈ దాడులు విజయవంతమయ్యాయని ఇరాక్, పాలస్తీనాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నృత్యం చేసారు. మరి ఇది దేనికి సంకేతం? ఇజ్రాయెల్ యుద్ధ సామర్థ్యాన్ని తనను తాను, ఇతర దేశాలు ఎక్కువ ఊహించుకుంటున్నాయా అనే సందేహం కలుగుతోంది. అయితే సాంకేతికంగా ఇజ్రాయెల్ ఇరాన్ కంటే, ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఎంతో ముందున్నది. ఈ యుద్ధం ముంగిట ఎవరి మిలిటరీ సామర్థ్యమెంతో చూద్దాం.
సైనిక బలగం (Military strength):
ఇజ్రాయెల్‌కు 1,70,000ల మంది సైనికులు, 4,65,000 మంది రిజర్వ్ దళాలు, 35వేల మంది పారా మిలిటరీ బలగం ఉంది. అదే ఇరాన్‌కు 6,10,000ల మంది సైనికులు, 3,50,000ల మంది రిజర్వ్ బలగం, 2,20,00ల మంది పారామిలిటరీ శక్తి ఉంది. ఇక్కడ స్పష్టంగా ఇరాన్‌దే అధిపత్యం.

భూతల యుద్ధ వ్యవస్థలు (Land forces) :
ఇజ్రాయెల్ 1370 ట్యాంకులు, 43,407 సాయుధ శకటాలతో పాటు 650 స్వయంచాలిత ఫిరంగి వ్యవస్థలు, 150 రాకెట్ ఫిరంగులను కలిగిఉండగా, ఇరాన్‌కు 1996 ట్యాంకులు, 65, 765 సాయుధ శకటాలతో పాటు 580 స్వయంచాలిత ఫిరంగి వ్యవస్థలు, 775 రాకెట్ ఫిరంగులున్నాయి. ఇక్కడా ఇరాన్‌దే ఆధిక్యం.
గగనతల సామర్థ్యం (Air power):
ఇజ్రాయెల్‌కు మొత్తంగా 612 యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, ఇతరాలు ఉన్నాయి. ఇందులో 241 ఫైటర్ జెట్లు, 146 హెలీకాప్టర్లు, ఇంకా ఇతర వాహనాలు ఉన్నాయి. అదే ఇరాన్‌కు 551 యుద్ధ విమానాలు, ఇందులో 186 ఫైటర్ జెట్లు, 102 హెలీకాప్టర్లు, ఇంకా ఇతరాలు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ఆధిక్యంలో ఉంది.

నావికాదళ సామర్థ్యం (Naval capabilities ):
ఈ వ్యవస్థలో ఇజ్రాయెల్ కనిపించేంత బలహీనమే. దానికి ఒక్క యుద్ధనౌక కూడా లేకపోగా, ఏడు మాత్రమే రక్షణ నౌకలున్నాయి. జలాంతర్గాములు 5 ఉండగా, గస్తీ నౌకలు 45 ఉన్నాయి. మందుపాతర వ్యవస్థ ఒకటి కూడా లేదు. అదే ఇరాన్‌కు 7 యుద్ధనౌకలు, 3 రక్షణ నౌకలు, 19 జలాంతర్గాములు, 21 గస్తీ నౌకలు, ఒక మందుపాతర వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ కూడా స్పష్టంగా ఇరాన్‌దే ఆధిపత్యం.
ఈ ప్రకారంగా చూస్తే ఇరాన్ ఆధిక్యం స్పష్టంగా ఉంది. ఒక్క గగనతల వ్యవస్థల్లోనే ఇజ్రాయెల్ కొంచెం మెరుగ్గా ఉంది. మరి ఇజ్రాయెల్ ఎలా ధైర్యం చేస్తోంది? అమెరికా తన అన్ని దళాలను సాయంగా పంపుతోంది. అది ఇక్కడ ఇజ్రాయెల్‌కు లాభమే. అమెరికా ఇజ్రాయెల్ తరపున పూర్తిస్థాయిలో పోరాడుతుంది కాబట్టి, తన బలగాలన్నీ ఇజ్రాయెల్విగానే భావించాలి. అప్పుడు ఇజ్రాయెల్ శక్తి అపారంగా పెరుగుతుంది. బహుశా ఇదే ఆ ధైర్యమేమో.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram