Megaquake | 3 లక్షల మందిని బలిగొనే మెగా భూకంపం? అరుదైన చేప కనిపించడం దేనికి సంకేతం?
మెగా భూకంపం విషయంలో ఒక జానపద కథ చర్చల్లోకి వచ్చింది. జపాన్ వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలతో ఈ కథను పోల్చుతున్నారు. సముద్రం నుంచి ఒక అరుదైన జాతి చేప కనిపించడం అంటే భారీ భూకంపం లేదా సునామీ హెచ్చరికగా భావిస్తుంటారు. ఆ చేప పేరు...

- సంభావ్యతపై జపాన్ ప్రభుత్వ నివేదిక
- జరిగే ఆర్థిక నష్టం.. జపాన్ జీడీపీలో సుమారు సగం!
- మెక్సికోలో కనిపించిన అరుదైన జాతి చేప
- సముద్ర దేవుడి అంతఃపుర దూతగా జానపద కథ
- మెగా భూకంపంపై పెరుగుతున్న ఊహగానాలు
Megaquake | మయన్మార్- థాయ్‌లాండ్ భూకంపాల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. జపాన్ పసిఫిక్ తీరంలోని నాన్‌కాయి త్రూలో అత్యంత శక్తిమంతమైన ‘మెగా భూకంపం’ సంభవించే అవకాశం ఉన్నదని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ పెను విపత్కర పరిస్థితి చోటు చేసుకుంటూ భయానక సునామీలు వచ్చి, పెద్ద ఎత్తున మౌలిక వసతులు దెబ్బతింటాయని తెలిపింది. ఈ మెగా భూకంపం తీవ్రతతో మూడు లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. 7.7 తీవ్రతతో మయన్మార్‌లో వచ్చిన భూకంపం 2900 మందిని బలిగొన్న నేపథ్యంలో ఈ వార్త ఆందోళన రేపుతున్నది. 2011లో 9 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చి సునామీకి కారణమైన సంగతి తెలిసిందే. రానున్నదని అంచనా వేస్తున్న మెగా భూకంపం తీవ్రత 9 పాయింట్లుగా ఉంటుందని జపాన్ ప్రభుత్వం నివేదిక పేర్కొంటున్నది. ప్రత్యేకించి శీతాకాలంలో రాత్రిపూట సంభవించిన పక్షంలో ఎంతలేదనుకున్నా 2,98,000 మంది చనిపోయే అవకాశం ఉంటుందని తెలిపింది. ఆర్థిక పరంగా 270.3 ట్రిలియన్ ఎన్‌ల మేరకు అంటే సుమారు జపాన్ జీడీపీలో సగం.. ఆర్థిక నష్టాలు ఉంటాయని ఆ నివేదిక అంచనా వేసింది. లక్ష మందికిపై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఏమిటీ మెగా భూకంపం?
నాన్‌కాయి త్రూలో సెస్మిక్ యాక్టివిటీ గణనీయంగా పెరిగినట్టు గుర్తించిన నేపథ్యంలో జపాన్ తన మొట్టమొదటి మెగా భూకంపంపై అడ్వయిజరీని గత ఏడాది విడుదల చేసింది. 8 పాయింట్లపై ఆపైన తీవ్రతతో వచ్చేవాటిని మెగా భూకంపాలుగా పరిగణిస్తారు. ఇటువంటి సందర్భాల్లో సునామీ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2011లో జపాన్‌లో 9 పాయింట్ల తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీని సృష్టించింది. ఈ విలయంలో పెను విధ్వసం చోటు చేసుకోగా.. కనీసం 20వేల మంది చనిపోయి ఉంటారని అంచనా. ప్రపంచంలో తీవ్రమైన సెస్మికల్ యాక్టివ్ జోన్‌గా ఉన్న పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో జపాన్ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పసిఫిక్, ఫిలిప్పైనీ, జువాన్ డీ పుఖా, కోకోస్, నాజ్కా వంటి ప్రధాన టెక్టానిక్ ప్లేట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం టెక్టానిక్ ప్లేట్లు ఢీకొని, ఒకదాని కిందకు ఒకటి వెళుతూ ఉంటాయి. అందుకే జపాన్‌లో తరచూ భూకంపాలు, అప్పుడప్పుడూ తీవ్ర భూకంపాలు వస్తూ ఉంటాయి. మెగా భూకంపం వస్తుందని అంచనా వేస్తున్న నాన్‌కాయి త్రూ అనేది జపాన్ నైరుతి పసిఫిక్ తీరంలో సుమారు 900 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక్కడే యూరేషియన్ ప్లేట్ కిందకు ఫిలిప్పైనీ ప్లేట్ జారుతూ ఉంటుంది. ఒకదానికింద ఒకటి పేరుకుపోయే టెక్టానిక్ ప్లేట్ల ప్రక్రియ వంద నుంచి నూట యాభై ఏళ్లలో ఒక మెగా భూకంపానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జపాన్ హై రిస్క్ జోన్‌లో ఉన్నది. నాన్‌కాయి త్రూ వద్ద 8 నుంచి 9 తీవ్రతతో భూకంపం వచ్చేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయని జపాన్ ప్రభుత్వం నివేదిక చెబుతున్నది. నాన్‌కాయి త్రూలో యూరేషియన్ ప్లేట్‌పై ఫిలిప్పైనీ ప్లేట్ ఒత్తిడి మెగా భూకంపానికి, సునామీకి కారణమవుతుందని జపాన్ మెటియోరోలాజికల్ ఏజెన్సీ హెచ్చరిస్తున్నది. ఈ ప్లేట్లు ఢీకొనడం వల్ల పెద్ద ఎత్తున శక్తి విడుదలై భూకంపాలకు కారణమవుతుంది.
అరుదైన చేప చేస్తున్న హెచ్చరికా?
ప్రకృతితో మమేకమైనవారికి ఆ ప్రకృతి పంపే కొన్ని సంకేతాలు అర్థమవుతాయి. ఈ మెగా భూకంపం విషయంలో కూడా ఒక జానపద కథ చర్చల్లోకి వచ్చింది. జపాన్ వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలతో ఈ జానపద కథను పోల్చుతున్నారు. సముద్రం నుంచి ఒక అరుదైన జాతి చేప కనిపించడం అంటే భారీ భూకంపం లేదా సునామీ హెచ్చరికగా భావిస్తుంటారు. ఇప్పుడు ఓయార్‌ఫిష్ అనే చేప కనిపించడం రాబోయే పెను ప్రమాదానికి సంకేతంగా అంచనా వేస్తున్నారు. దీనికి ‘రియూగు నో సుకాయి’ లేదా సముద్ర దేవుడి అంతఃపుర దూత అని దీనికి ముద్దుపేరు కూడా ఉన్నది. ఇటీవలి కాలంలో ఈ చేప వెలుగు చూసిందని అంటున్నారు. దీంతో మెగా భూకంపంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. పొడవుగా రిబ్బన్ తరహా శరీరంతో వెండి పొలుసులతో ఉండే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ తీరంలో కనిపించినట్టు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు.