Kamala Harris ahead । కమలా హ్యారిస్‌కు జై కొడుతున్న నాటి ట్రంప్ మద్దతుదారులు!
ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ విజయానికి కారణమైన కీలక రాష్ట్రాల్లోని శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ ఓటర్లు ఇప్పుడు కమలా హ్యారిస్‌కు మద్దతు పలుకుతున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది
Kamala Harris ahead । అమెరికా కొత్త అధ్యక్షుడి ఎంపికలో కీలకమైన రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ (Kamala Harris)కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కమల విజయం సాధించాలంటే ఈ రాష్ట్రాలే కీలకం. ఇక్కడ శ్వేత జాతీయులు అధిక సంఖ్యలో ఉంటారు. వాస్తవానికి వారంతా గతంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులుగా ఉండటం విశేషం. మిషిగాన్ (Michigan), పెన్సిల్వేనియా (Pennsylvania), విస్కాన్సిన్ (Wisconsin) రాష్ట్రాల్లో శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ (white working-class) ఎక్కువగా నివసిస్తుంటారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి వీరే కారణమయ్యారు.
సంప్రదాయకంగా ట్రంప్‌నకు కరడుగట్టిన మద్దతుదారులైన శ్వేతజాతి వర్కింగ్ క్లాస్ ఓటర్లు.. ఇప్పుడు కమలాహ్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అనూహ్య మార్పు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్‌లో పోలింగ్ (presidential election) జరుగనున్నది. ఫలితాలు తారుమారు కాగల ఏడు రాష్ట్రాల్లో కమలాహ్యారిస్ ముందంజలో ఉన్నట్టు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పోల్‌లో ట్రంప్ గ్రాఫ్ తగ్గుముఖం పట్టింది. బైడెన్ బరిలో ఉన్నప్పుడు ఆయనకు ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయం.. ఆయన స్థానంలో కమలా హ్యారిస్ వైపు మళ్లుతుండటం డెమోక్రాట్లలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది.
జోబైడెన్‌తో పోటీపడుతున్న సమయంలో కాలేజీ విద్య చదవని శ్వేతజాతి (non-college-educated) ఓటర్లలో మే నెలలో ట్రంప్‌నకు 25 పాయింట్లు అధిక్యత లభించింది. ఇప్పుడు ఆ ఆధిక్యం.. 11 పాయింట్లు తగ్గిపోయింది.
ట్రంప్ మే నెలలో 25 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ.. ఇప్పుడు ఆగస్ట్‌లో 14 పాయింట్లతో ఉన్నారు. అంటే ఆయనకు జనామోదం దాదాపు సగానికి పడిపోయిందని సీఎన్‌ఎన్ సీనియర్ డాటా రిపోర్టర్ హ్యారీ ఎన్‌టెన్ చెప్పారు. నాలుగేళ్ల క్రితంతో పోల్చితే కీలకమైన రాష్ట్రాల్లో బైడెన్ కంటే మెరుగైన జనాదరణ కమలా హ్యారిస్‌కు కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఈ సంఖ్యను కమల మరింత పెంచుకుంటే ఆమెదే విజయమని చెప్పారు.
కాలేజీ విద్యనభ్యసించని శ్వేతజాతీయులే ఎన్నికల్లో కీలకం
అమెరికా ఓటర్లలో కాలేజీ విద్యనభ్యసించని శ్వేతజాతి ఓటర్లే అత్యంత కీలకం. ప్రత్యేకించి స్వింగ్ స్టేట్స్‌లో మొత్తం ఓటర్లలో వారు సగభాగం వరకూ ఉంటారని అంచనా. కాలేజీ విద్యను అభ్యసించిన శ్వేతజాతీయులు 27 శాతం ఉంటారు. మిగిలిన 13శాతం నల్లజాతీయులు, ఇతరులు ఉంటారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram