Nepal | నేపాల్ కొత్త ప్రధానిగా మరోసారి కేపీ శర్మ ఓలి
నేపాల్‌లోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ శర్మ ఓలి ఆ దేశ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధాని పగ్గాలు చేపట్టడం ఇది నాలుగోసారి. రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు

ఖట్మాండు: నేపాల్‌లోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ శర్మ ఓలి ఆ దేశ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రధాని పగ్గాలు చేపట్టడం ఇది నాలుగోసారి. రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు. శుక్రవారం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) చైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో రాజ్యాంగంలోని 76(2) అధికరణం మేరకు ఆయన స్థానంలో ఓలి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
రాజ్యాంగంలోని 76(2) అధికరణం ప్రకారం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్ యూఎంఎల్) చైర్మన్ ఓలిని దేశాధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ నియమించారని అధ్యక్ష భవనం పేర్కొన్నది. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలి ప్రధాని పదవి చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి అయిన శీతల్ నివాస్‌లో ఓలి ప్రధానిగా ప్రమాణం స్వీకరించారు. రాజ్యాంగం ప్రకారం.. ఓలి 30 రోజులలోగా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాల్సి ఉంటుంది. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఓలి కనీసం 138 మంది మద్దతు పొందాల్సి ఉంటుంది.
శుక్రవారం నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఓలి అవకాశం కోరారు. తనకు మద్దతుగా 165 మంది సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఇందులో సీపీఎన్ యూఎంఎల్‌కు చెందిన 77 మంది, నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన 88 మంది సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే.. కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఏడు అంశాల ప్రాతిపదికన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవుబా, సీపీఎన్ యూఎంఎల్ చైర్మన్ ఓలి ఒక ఒప్పందానికి వచ్చారు. ఇందులో మిగిలిన పదవీకాలాన్ని రొటేషన్ పద్ధతిలో చెరిసగం పంచుకోవడం కూడా ఒకటి. నేపాల్ పార్లమెంటు ఎన్నికలు 2027లో జరుగనున్నాయి.
ఓలి ప్రభుత్వంలో ఇతర రాజకీయ పార్టీలైన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాది పార్టీ నేపాల్, లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాది పార్టీ, జనమత్ పార్టీ , నాగరిక్ ఉన్ముక్తి పార్టీ కూడా చేరే అవకాశం ఉన్నది.
ఓలి గతంలో 2015 అక్టోబర్ 11 నుంచి 2016 ఆగస్ట్ 3 వరకు తొలిసారి ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 2018 ఫిబ్రవరి 5 నుంచి 2021 జూలై 13 వరకూ, 2021 మే 13 నుంచి 2021 జూలై 13 వరకూ ప్రధానిగా కొనసాగారు. నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. గణతంత్ర వ్యవస్థ ప్రవేశపెట్టిన దగ్గర నంచి గత పదహారేళ్లలో 14 ప్రభుత్వాలను ఆ దేశం చూసింది.