ఎవరెస్ట్ ఎక్కుతూ 1924లో మాయం – సరిగ్గా వందేళ్ల తర్వాత..!
ఈమధ్య నేషనల్ జియెగ్రాఫిక్కు చెందిన పరిశోధకులు ఎవరెస్ట్ పర్వతం వద్ద ఒక మనిషి పాదం చూసారు. దానికి ఉన్న షూ, సాక్స్‌ను బట్టి అది ఎవరిదో గుర్తుపట్టారు. అది వందేళ్ల నాటిది.

నేషనల్ జియోగ్రాఫిక్(National Geographic)కు చెందిన చిత్రబృందం ఒకటి ఎవరెస్ట్ వద్ద చిత్రీకరణ చేస్తుండగా, ఒక వస్తువు బృంద నాయకుడు, ఫోటోగ్రాఫర్ అయిన జిమ్మీ చిన్(Jimmy Chin) దృష్టిని ఆకర్షించింది. అందరూ కలిసి దాన్ని పరిశీలించగా, అదొక మనిషి పాదం అవశేషాలు(Foot remains)గా గుర్తించారు. దానికి ఉన్న షూ వేగంగా మంచులో కరిగిపోతోంది. అది వందేళ్ల క్రితం(100 years back) ఎవరెస్ట్(Mount Everest)ను అధిరోహిస్తూ అంతర్థానం అయిన పర్వతారోహకుడు, ముద్దుగా సాండీగా పిలుచుకునే ఆండ్రూ కామిన్ ఇర్విన్(Andrew Comyn Irvine)ది అని తేల్చారు. నిజానికి అతనితో ప్రఖ్యాత పర్వతారోహకుడు జార్జ్ మలోరీ (George Mallory)కూడా ఉన్నాడు.
తాను పాదానికి ఉన్న సాక్స్‌ను ఎత్తి చూడగా, ఒక ఎరుపు రంగు లేబుల్ మీద ఏసీ ఇర్విన్ అని కుట్టబడిఉందని చిన్ నేషనల్ జియోకు తెలిపారు. మొన్న సెప్టెంబర్‌లో ఎవరెస్ట్ ఉత్తర ముఖద్వారం కిందుగా, తూర్పు రాంగ్బక్ హిమానీనదం(east Rangbok Glacier) వద్ద ఎన్జీసీకి చెందిన డాక్యుమెంటరీ బృందం ఫోటోగ్రాఫర్ జిమ్మీ చిన్ నేతృత్వంలో ఒక బూటును కనుగొంది. కొంత మేరకు పాదం అవశేషాలతో పాటు సాక్స్ కూడా అందులో ఉన్నాయి.
ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్కేల కంటే ముందే..?
వంద సంవత్సరాల క్రితం, 8 జూన్ 1924న ఆండ్రూ కామిన్ ఇర్విన్(22), జార్జ్ మాలోరీతో కలిసి ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. మలోరీ అవశేషాలు 1999లోనే కనుగొనగా, ఇర్విన్వి మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఈ బూట్ చాలా ప్రశ్నలకు సమాధానమివ్వగలదని ఆశిస్తున్నారు. అసలు వందేళ్ల క్రితం ఆ పర్వతంపై ఏం జరిగింది? ఈ జంట ఎవరెస్ట్‌ను అధిరోహించగలిగిందా? ఒకవేళ అధిరోహిస్తే, ఎడ్మండ్ హిల్లరీ(Edmund Hillary), టెన్జింగ్ నార్కే(Tenzing Norgay)ల కంటే ముందు వారే తొలి ఎవరెస్ట్ అధిరోహకులవుతారు. హిల్లరీ, నార్కేలు 29 మే 1953న ఎవరెస్ట్‌ను అధిరోహించారు.
కాగా, 1999లో ఆల్ప్స్ పర్వాతారోహకుడు కాన్రాడ్ ఆంకర్(Conrad Anker) జార్జ్ మలోరీ మృతదేహాన్ని కనుగొన్నప్పుడు, ఆయనకు కొన్ని ఆధారాలు లభించాయి. వాటి ప్రకారం, ఇర్విన్, మలోరీలు ఎవరెస్ట్‌ను అధిరోహించిన తర్వాత కిందకు దిగుతున్నప్పుడు పడిపోయారని తెలుస్తోంది. “మాలొరీ నల్లటి మంచు కళ్లజోడు(dark snow goggles) ఆయన జేబులో ఉంది. అంటే వారు పడిపోయినప్పుడు సాయంత్ర సమయం అయిఉండవచ్చు. శిఖరం మీద పెడదామనుకున్న అతని భార్య ఫోటో మృతదేహం వద్ద లభించలేదు.” అని ఆంకర్ లాస్ట్ ఎక్స్ప్లోరర్లో రాసాడు.
ప్రస్తుతం ఇర్విన్ పాద అవశేషాలపై డిఎన్ఏ(DNA tests) పరీక్షలు జరుగుతున్నాయి. ఒకవేళ మరిన్ని ఆధారాలు లభించి వీరిద్దరూ ఎవరెస్ట్‌ను అధిరోహించారని రుజువయితే హిల్లరీ, నార్కేల రికార్డు కనుమరుగవుతుంది.