President Trump | ఆరు నెలల్లో ఆరు యుద్ధాలు ఆపా! ట్రూత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
President Trump | గాజాలోని బందీలను వెనుకకు తిరిగి తీసుకురావాలంటే హమాస్‌ను తుద ముట్టించడం ఒక్కటే మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది ఎంత త్వరగా జరిగితే విజయానికి అంత మెరుగైన అవకాశాలు ఉంటాయని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం నేపథ్యంలో ట్రూత్‌లో స్పందించిన ట్రంప్.. ఆరు నెలల్లో ఆరు యుద్ధాలు ఆపిన ఏకైక నేతను తానేనని చెప్పుకొన్నారు. ‘గుర్తుంచుకోండి.. వందల మంది బందీలను విడిపించి, ఇజ్రాయెల్‌కు, అమెరికాకు తిరిగి వెళ్లేందుకు సంప్రదింపులు జరిపిన ఏకైక వ్యక్తిని నేనే. ఆరు నెలల్లో ఆరు యుద్ధాలు ఆపిన ఏకైక వ్యక్తిని కూడా నేనే’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇరాన్ అణు వ్యవస్థలను కట్టడి చేసింది కూడా నేనే. గెలవడానికి ఆడండి. లేదంటే అసలు ఆడకండి. ఈ విషయంలో దృష్టిపెట్టినందుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతను తానే ఆపానని, తాను చేసిన ఒత్తిడితోనే రెండు దేశాలు కాల్పుల విరమణ పాటించాయని ట్రంప్ చెప్పారు. అయితే.. ఈ విషయంలో లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఈ మాటలు వాస్తవాలు కాకుంటే ట్రంప్‌ను అబద్ధాలకోరుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. కానీ.. ప్రధాని మాత్రం ట్రంప్ చొరవతోనే కాల్పుల విరమణ కుదిరిందని చెప్పలేదు. పైగా.. పాకిస్తాన్ సైనికాధికారులు బతిమలాడితేనే తాము కాల్పులు విరమించామని చెప్పారు. వాస్తవానికి కాల్పుల విరమణ అంశాన్ని ట్రంప్ భారతదేశం ప్రకటించడానికి ముందే ప్రకటించి సంచలనం రేపారు. రాత్రంతా తాము కష్టపడి చేసిన చర్చలతో కాల్పుల విరమణ సాధ్యమైందన్నారు. తర్వాత కూడా అనేక సందర్భాల్లో తన ఘనతేనని చెప్పుకొన్నారు. కొన్ని ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణలో ట్రంప్ దౌత్యపర జోక్యం ఉన్నప్పటికీ ఆయన ఆరు యుద్ధాలు ఆపాననడం వాస్తవానికి దూరంగా ఉందన్న అభిప్రాయాన్ని పొలిటిఫ్యాక్ట్ వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఘర్షణలను ఆపుతున్న ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమానం ఇవ్వాలని వైట్ హస్ వర్గాలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నాయి. టారిఫ్‌ల భారం తప్పించుకున్న పాకిస్తాన్, మరికొన్ని దేశాలు సైతం ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తుండటం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram