Zohran Mamdani | జోహ్రాన్‌ మమ్దానీ చేతికి ఉన్న మూడు ఉంగరాల కథేంటి?

న్యూయార్క్‌ మేయర్‌గా సంచలన విజయం సాధించి జోహ్రాన్‌ మమ్దానీ రెండు చేతులకు ఉన్న మూడు ఉంగరాల వెనుక ఆసక్తికర కథలు ఉన్నాయి.

Zohran Mamdani | జోహ్రాన్‌ మమ్దానీ చేతికి ఉన్న మూడు ఉంగరాల కథేంటి?

Zohran Mamdani | చాలా మంది ఉంగరాలు ధరించడం చూస్తూనే ఉంటాం. కొంతమంది అలంకరణ కోసం ఉంగరాలు పెట్టుకుంటారు. మరికొందరు నమ్మకాలతో చేతివేళ్లను ఉంగరాలతో నింపేస్తూ ఉంటారు. కొందరికి ఉంగరాలు సెంటిమెంట్‌. న్యూయార్క్‌ నగర మేయర్‌గా సంచలన విజయం సాధించిన భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ చేతికి ఉన్న ఉంగారాలు కూడా ఇదే క్యాటగిరీలోకి వెళతాయి. అమెరికాలోనే అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి భారత సంతతి వ్యక్తిగా, పుట్టుకతో తొలి ఆఫ్రికన్‌గా జోహ్రాన్‌ మమ్దానీ సంచలన విజయం సాధించారు. సంప్రదాయాలకు భిన్నంగా సాగిన ఆయన ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. తద్వారా న్యూయార్క్‌ రాజకీయాల్లో ప్రముఖుడిగా పేరొందిన ఆండ్రూ క్యూమోపై విజయం సాధించారు.

ఆయన చేతికి ఉన్న ఉంగరాలకు పెద్ద కథే ఉంది. అంతకు మించి సెంటిమెంట్‌ ఉంది. ఆయన రెండు చేతులకు మొత్తం మూడు ఉంగారాలు ఉంటాయి. అందులో కుడి చేతికి రెండు ఉంటే, ఎడమ చేతికి ఒకటి ఉంటుంది. ఫలితాలకు ముందు న్యూయార్క్‌ టైమ్స్‌తో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ ఉంగరాల విషయాన్ని వెల్లడించారు. 2013లో మమ్దానీ తాత చనిపోయారు. ఆయన గుర్తుగా ఒక ఉంగరాన్ని అప్పటి నుంచి మమ్దానీ ధరిస్తున్నారు. ‘ఆయన కుడి చేయి చూపుడు వేలుకు ఉన్న ఉంగరం.. తన తాత నుంచి వారసత్వంగా పొందింది. 2007లో సిరియా వెళ్లిన సమయంలో ఆయన దానిని పొందారు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొంటున్నది. ‘ఇది నాకు ఆశీర్వాదం. మా తాతను నా జీవితంలో భాగంగా ఉంచుకోవడం కోసం దీనిని ధరిస్తున్నా’ అని మమ్దానీ చెప్పారు.

కుడి చేతికి ఉన్న మరో ఉంగరం.. మమ్దానీకి ఆయన భార్య, కళాకారిణి రమా దువాజీ ట్యునిషియా పర్యటన సందర్భంగా బహూకరించింది.

ఇక ఎడమ చేతి ఉంగరపు వేలికి ఉన్నదాని గురించి చెప్పేదేముంది.. అది మామ్మానీ వివాహపు ఉంగరం.

ఇవి కాకుండా మరో ఉంగరాన్ని కూడా మమ్దానీ ధరిస్తూ ఉంటారు. దానికి ఆయన భార్య స్వయంగా డిజైన్‌ చేశారు. అది బిగుతుగా మారిపోయిన నేపథ్యంలో దానిని తరచుగా ధరించడం లేదు. అయితే.. దీనిని రీసైజ్‌ చేయించాలని అనుకున్నా.. ఒక కాలువలో అది పడిపోయింది. అది చాలా బాధించిందని మమ్దానీ చెప్పారు. జోహ్రాన్‌ మమ్దానీ ఇండియన్‌–అమెరికన్‌ దర్శకురాలు మీరా నాయర్‌కు, ఉగాండన్‌–అమెరికన్‌ విద్యావేత్త మహ్మద్‌ మమ్దానీ కుమారుడ. అతనికున్న వారసత్వంలానే.. ఆ ఉంగరాలు కూడా సంస్కృతి, సంప్రదాయల మేలు కలయికగా ఉన్నాయి.