One more Pandemic | ప్రపంచం కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కోనుందా.. బ్రిటన్ శాస్త్రవేత్త ఏం చెప్పారు..?
One more Pandemic | ప్రపంచంలో నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం అంతాఇంతా కాదు. ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలు ఆ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నాయి. అయితే కరోనా మహమ్మారి పీడ విరగడైందనే సంతోషం ఎంతో కాలం నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని ఓ బ్రిటిష్ శాస్త్రవేత్త హెచ్చరించారు. మరో మహమ్మారి ప్రబలడం అనివార్యమని పేర్కొన్నారు.

One more Pandemic : ప్రపంచంలో నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం అంతాఇంతా కాదు. ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలు ఆ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నాయి. అయితే కరోనా మహమ్మారి పీడ విరగడైందనే సంతోషం ఎంతో కాలం నిలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని ఓ బ్రిటిష్ శాస్త్రవేత్త హెచ్చరించారు. మరో మహమ్మారి ప్రబలడం అనివార్యమని పేర్కొన్నారు.
రాబోయే ఉపద్రవాలకు ప్రపంచ దేశాలు సిద్ధం కావాలని బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ పాట్రిక్ వాలెన్స్ చెప్పారు. ఆయన గతంలో బ్రిటన్ ప్రభుత్వానికి మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. పోవిస్‌లోని హే ఫెస్టివల్‌లో జరిగిన కార్యక్రమంలో వాలెన్స్ మాట్లాడారు. వైరస్ హెచ్చరికలను గుర్తించడానికి యూకే తప్పనిసరిగా మెరుగైన నిఘా పద్ధతులను అమలు చేయాలని ఆ శాస్త్రవేత్త నొక్కి చెప్పారు. మహమ్మారి లాంటి పరిస్థితిని నివారించడానికి ఆయన కొన్ని చిట్కాలను కూడా సూచించారు.
వ్యాక్సిన్‌లు, రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సలు లాంటి చర్యలు వైరస్‌తో పోరాడటంలో సహాయపడతాయని పాట్రిక్ తెలిపారు. ఈ చర్యలను అమలు చేయగలిగినప్పటికీ, అందుకు ఇంకా సమన్వయం అవసరమని అన్నారు. కరోనా మహమ్మారి భయంకరమైన అనుభవాల నుంచి ఈ ప్రపంచం బయటపడిందని, మళ్లీ అదే తరహా సంక్షోభం ఎదుర్కోవడం కచ్చితంగా అనివార్యమని పాట్రిక్ వాలెన్స్ అన్నారు. ఈ దిశలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
సంక్షోభం ఎదురైన సమయంలో తక్షణమే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లతో అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని పాట్రిక్ వాలెన్స్ సూచించారు. అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దానివల్ల లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్ లాంటి కఠిన చర్యల అవసరం ఉండబోదని చెప్పారు. 2021లో తాను చేసిన సూచలన్నీ 2023 నాటికి అనేక దేశాలు మరచిపోయాయని తెలిపారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
సైనిక అవసరాల విషయంలో ఎలా అప్రమత్తమై ఉంటామో, మహమ్మారుల కట్టడి చర్యలకు సైతం అంతే ప్రాధాన్యం ఇవ్వాలని వాలెన్స్ చెప్పారు. యుద్ధంతో నిమిత్తం లేకుండా ఆర్మీ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే.. సంక్షోభ నివారణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని సూచించారు. మహమ్మారుల సంక్షోభ సమయంలో వివిధ దేశాలు కలిసికట్టు చర్యలు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకోవాలని పాట్రిక్ వాలెన్స్ సూచించారు.