Thomas Portes | ‘ఆ దేశపు అథ్లెట్లను ఒలింపిక్స్‌కు స్వాగతించం’.. ఫ్రాన్స్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Thomas Portes | ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా మరో నాలుగు రోజుల్లో అతిపెద్ద క్రీడా సంరంభం మొదలు కానుంది. పారిస్ నగరంలో ఒలింపిక్స్‌-2024 (Olympics 2024) క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ విశ్వ క్రీడలను నిర్వహించేందుకు ఇప్పటికే ఒలింపిక్‌ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Thomas Portes | ‘ఆ దేశపు అథ్లెట్లను ఒలింపిక్స్‌కు స్వాగతించం’.. ఫ్రాన్స్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Thomas Portes : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా మరో నాలుగు రోజుల్లో అతిపెద్ద క్రీడా సంరంభం మొదలు కానుంది. పారిస్ నగరంలో ఒలింపిక్స్‌-2024 (Olympics 2024) క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ విశ్వ క్రీడలను నిర్వహించేందుకు ఇప్పటికే ఒలింపిక్‌ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. క్రీడా గ్రామాల్లోకి అథ్లెట్లు క్రమంగా చేరుతున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ ఎంపీ థామస్‌ పోర్టెస్‌ (Thomas Portes) చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

గాజాలో యుద్ధం చేస్తున్న కారణంగా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో ఇజ్రాయెల్‌ అథ్లెట్లకు తాము స్వాగతం పలికేది లేదని ఎంపీ పోర్టెస్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో థామస్‌ మాట్లాడుతూ.. ‘పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రతినిధులు, అథ్లెట్లకు మేం స్వాగతం చెప్పం. ఈ క్రీడల్లో ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై నిషేధం విధించేలా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీపై ఫ్రాన్స్‌ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి. రష్యా విషయంలో అనుసరించిన విధంగానే చర్యలు తీసుకోవాలి. ద్వంద్వ వైఖరికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పోర్టెస్ వ్యాఖ్యానించారు.

ఎంపీ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపగా.. మరికొందరి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘ఇజ్రాయెల్‌ అథ్లెట్లను లక్ష్యం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇవన్నీ బాధ్యతారాహిత్యం వల్ల చేసినట్లే భావిస్తున్నాం. ఒలింపిక్‌ గేమ్స్‌లో ఇప్పటికే ఇజ్రాయెల్‌ అథ్లెట్లకు ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు వస్తున్నాయి. 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో 11 మందిని ఇలాగే చంపేశారు’ అని ఫ్రాన్స్‌కు చెందిన యూదుల గ్రూప్‌ ప్రతినిధి యోనాథన్‌ అర్ఫి గుర్తుచేశారు.